“దేశా”నికి దూరమవుతున్న బీసీ ఓట్లు!?

Update: 2019-02-17 06:06 GMT
“ మాది బీసీల పార్టీ. నిజానికి తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం. ఏ ప్రాంతీయ పార్టీకి లేని బి సి ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ సొంతం” ఇవి వారం రోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. ఆయనే కాదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుల నుంచి బూత్ స్థాయి నాయకుల వరకు ఇదే మాట. అయితే గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా చేసిన అనేక తప్పులు పార్టీకి బీసీలను దూరం చేసాయి అంటున్నారు. ఎన్నికల వరకు పార్టీకి పునాదిగా ఉన్న బీసీలను వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని కరివేపాకులా తీసేశారు అనే అభిప్రాయం బీసీల్లో బలంగా నాటుకుంది అంటున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లోని కొన్ని పట్టణాలు, నగరాల్లో బీసీల సదస్సులు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో బీసీలకు వరాల జల్లు కురిపిస్తున్న ట్లుగా తనదైన మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అయితే ఇవన్నీ ఎన్నికల స్టంట్ గా భావిస్తున్న బీసీలు తెలుగుదేశం పార్టీని విశ్వసించే పరిస్థితి లేదని తాజాగా అందిన ఇంటెలిజెన్స్ విభాగం సర్వే ద్వారా తెలిసింది అంటున్నారు. పైగా ప్రతిపక్ష వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో బీసీలను ఏకం చేసి వారిని తమ వైపు ఆకట్టుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న బీసీ సదస్సులో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ డిక్లరేషన్ను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి మిగిలిన కొద్దో గొప్పో బీసీ ఓట్లన్నీ వైయస్ ఆర్సీపీ వైపు మళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పైగా కాపులకు దగ్గరవడం కోసం బీసీలను చంద్రబాబు నాయుడు వంచించారనే కోపం బీసీల్లో ఎక్కువగా ఉంది. ఇది బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం కావడానికి కారణమైందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News