అమ్మాయిలకు అక్కడ వేధింపులు తప్పడం లేదా?

Update: 2020-10-07 10:50 GMT
ఆడది అర్ధరాత్రి స్వతంత్రంగా తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్ర్యం అని మహాత్ముడు చెప్పాడు.కానీ 75 ఏళ్లు దాటినా ఇంకా దేశంలో ఆడవాళ్ల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటూనే ఉంటున్నాయి. నిన్నటికి నిన్న హత్రాస్ లో బయటకొచ్చిన బాలికను నలుగురు కలిసి అత్యాచారం చేసి చంపారు. హైదరాబాద్ లో రాత్రి ఒంటరిగా బయటకొచ్చిన ‘దిశ’ను రేప్ చేసి చంపేశారు. ఇలా దేశంలో ఆడవారికి భద్రత లేకుండా పోయింది. బయటే కాదు.. ఇప్పుడు ఆన్ లైన్ లోనూ అదే పరిస్థితి నెలకొంది.

ఇంటి నుంచి అమ్మాయి కాలు బయటపెడితే సురక్షితంగా తిరిగి ఇంటికొచ్చేదాకా తల్లిదండ్రులకు టెన్షన్ తప్పడం లేదు. ఇంటా బయటే కాదు.. ఆన్ లైన్ లోనూ అమ్మాయిలకు భద్రత కరువవుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో అకౌంట్లున్న అమ్మాయిలకు నిత్యం అభ్యంతరక కామెంట్లు, వివక్షపూరిత పోస్టులే దర్శనమిస్తున్నాయి.

 బ్రిటన్ కు చెందిన ‘ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థ’ తాజాగా భారత్ తోపాటు అమెరికా, బ్రెజిల్, నైజీరియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, థాయిలాండ్ సహా 22 దేశాల్లో సర్వే చేసింది. ఇందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఏకంగా 58శాతం మంది అమ్మాయిలు ఆన్ లైన్ లో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టు తేలింది. సెక్సువల్ కామెంట్స్, ఫిజికల్ దాడులు చేస్తామన్న బెదిరింపులు ఎక్కువయ్యాయని తేలింది. అమ్మాయిలకు తెలియనవారు.. తెలిసిన వారు, ఫ్రెండ్స్, కొలీగ్స్ కూడా ఇలా బెదిరిస్తున్నారని సర్వేలో తేలింది.

15-22 ఏళ్ల మధ్య వయసున్న 14వేల మంది అమ్మాయిలతో మాట్లాడి వారు ఆన్ లైన్ లో ఎదుర్కొంటున్న వేధింపులు.. ఇబ్బందుల వివరాలను సర్వే సంస్థ సేకరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 5 మధ్య తీసుకున్న డేటాతో ఓ రిపోర్టును రూపొందించారు. ఈ నెల 11న ఇంటర్నేషన్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ‘స్టేట్ ఆఫ్ ది వర్ల్డ్ గర్ల్స్’ రిపోర్ట్ పేరిట దీనిని విడుదల చేశారు.

పేద దేశం.. ధనిక దేశం.. అభివృద్ధి చెందుతున్న దేశం అనే తేడా లేకుండా అమ్మాయిలకు ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో భద్రత లేదని ఈ సర్వేలో తేలింది. తమ ప్రాంతాన్ని కుల, మతాలను బట్టి కొందరు విద్వేష, వివక్ష పూరిత పోస్టులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని..దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.

తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఏకంగా 47శాతం మంది అమ్మాయిలు సర్వేలో తెలిపారు. వెకిలి కామెంట్లు పెడుతున్నారని ఏకంగా 59శాతం మంది చెప్పారు. కమ్యూనిటీ, కుల, మతం ప్రాంతం, జెండర్ ఆధారంగా అమ్మాయిలకు వేధింపులు ఎదురవుతున్నాయని 42శాతం మంది తెలిపారు.

ఇక ఈ ఆన్ లైన్ వేధింపులతో మానసికంగా కృంగిపోతున్నామని సర్వేలో మహిళలు వాపోయారు. శారీరకంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని 42శాతం మంది మహిళలు వాపోయారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దీని వల్ల తగ్గిపోతుందని 42శాతం మంది వాపోయారు. ఈ వేధింపులతో ఏకంగా సోషల్ మీడియాను వదిలేశామని 20శాతం మంది అమ్మాయిలు చెప్పడం గమనార్హం.
Tags:    

Similar News