టీ మంత్రులకు కాపలా కాసిన కొండముచ్చు

Update: 2015-09-02 04:43 GMT
ఏపీ మంత్రులతో పోలిస్తే.. తెలంగాణ మంత్రుల స్పీడ్ చాలా ఎక్కువ. చురుకుదనం కూడా ఎక్కువే. పాదరసంలా జారిపోతూ.. ఏ విషయంలో దొరకని వారు.. అవసరానికి తగ్గట్లు ఎంతటి శ్రమకైనా సిద్ధంగా ఉంటారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏపీ.. తెలంగాణ మంత్రులను పోల్చి చూస్తే.. తెలంగాణ మంత్రులు ఎంత హుషారుగా పని చేశారో కనిపిస్తుంది.

గోదావరి పుష్కరాల సమయంలోనే కాదు.. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఇందుకోసం కొన్నిసార్లు సాహసాలు కూడా చేస్తుంటారు. అయితే.. మంత్రుల స్పీడ్ కు తగినట్లుగా ఏర్పాట్లు చేయకపోతే లేనిపోని తలనొప్పులు చోటు చేసుకునే వీలుంది.

ఆ మధ్య మంత్రుల కార్యక్రమాలకు తేనెటీగల దాడితో మహా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. తాజాగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. మంత్రి హరీశ్ లాంటి వారు అయితే.. ఏ విషయంలో అయినా ముందుకు పోవటమే తప్పించి.. వెనక్కు పోవటం ఉండదు. కార్యక్రమాల కోసం ఆయన ఎంతటి రిమోట్ ప్రాంతాల్లో అయినా పర్యటిస్తుంటారు. తాజాగా.. హరీశ్.. తనతో పాటు మంత్రులు పద్మారావు.. జోగురామన్నలతో కలిసి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా నర్సంపేట మాదన్నపేట చెరువు కట్టపై మంత్రి హరీశ్ మాట్లాడారు. అనంతరం వారికి అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే.. ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు అధికారులు తెలివిగా.. కొండముచ్చులను సీన్ లోకి తీసుకొచ్చారు. మంత్రులకు రక్షణ ఉంచేందుకు.. కోతులు సమీపంలోకి రాకుండా చేసేందుకు కొండముచ్చుల్ని తీసుకొచ్చిన అధికారులు భోజనాల దగ్గర దాన్ని ఉంచారు.

మంత్రులు ఉన్నంతసేపు అరుస్తూ.. కోతులు ఆ సమీపానికి రాకుండా చేయటంతో కొండముచ్చు సక్సెస్ కావటం.. కోతుల బెడద లేకుండా పోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారట. మొత్తానికి అధికారులు ముందుచూపుతో చేసిన ఏర్పాటును పలువురు అభినందిస్తున్నారు.
Tags:    

Similar News