ఉత్తమ్ మాటల మీద కోర్టుకు హరీశ్

Update: 2016-02-21 05:23 GMT
రాజకీయాలు అన్నాక విమర్శలు.. ఆరోపణలు మామూలే. కానీ.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ రథ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణల మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు. ఫైర్ బ్రాండ్ తరహాలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే హరీశ్.. తనపై ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలకు హర్ట్ అయ్యారు.

తమ ప్రత్యర్థులపై కనికరం లేకుండా విరుచుకుపడే హరీశ్ కు.. ఉత్తమ్ తన మీద చేసిన ఆరోపణల దాడిపై ఆయన తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఉత్తమ్ ఆరోపణల్ని.. ఆయన నిరూపించాలని హరీశ్ డిమాండ్ చేస్తున్నారు. నోటికి వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్న ఉత్తమ్.. తనపై చేసిన అవినీతి ఆరోపణల్ని కానీ నిరూపించకుంటే తన పీసీసీ పదవికి రాజీనామా చేస్తారా? అని సవాలు విసురుతున్నారు.

కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలను ఉత్తమ్ గుర్తు చేసుకోవాలని చెబుతున్న హరీశ్.. తమ సర్కారుపై చేస్తున్న ఆరోపణలపై తాము కోర్టుకు వెళతామని వెల్లడించారు. అవినీతి ఆరోపణలకు అస్కారం లేకుండా ఉండేందుకే దేశ వ్యాప్తంగా టెండర్లు ఆహ్వానించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. ఏది ఏమైనా తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులలో రూ.10వేలకోట్ల కుంభకోణం జరిగిందంటూ ఉత్తమ్ చేసిన ఆరోపణ హరీశ్ ను బాగానే హర్ట్ చేసినట్లుగా కనిపిస్తోందే.
Tags:    

Similar News