మంత్రి కోరుకుంటే పార్టీ పదవిచ్చారు... ?

Update: 2022-01-14 01:30 GMT
విశాఖ జిల్లా రాజకీయాల్లో జగన్ భక్తుడు అన్న పేరున్న యువ ఎమ్మెల్యే ఒకరున్నారు. ఆయనే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన గుడివాడది రాజకీయ కుటుంబం. ఆయన తాత గుడివాడ అప్పన్న, తండ్రి గురునాధరావు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇక గురునాధరావు అయితే నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా కొంతకాలం పనిచేశారు. అలా రాజకీయ కుటుంబం, బలమైన సామాజికవర్గం నేపధ్యం గుడివాడకు బాగా కలసి వచ్చిన అంశం. ఇక ఆయన తండ్రి మాదిరిగానే మంచి వాగ్దాటి కలిగిన నేత.

అంతే కాదు, ఆయన దూకుడుగా రాజకీయం చేస్తారు. జగన్  కి కూడా అదే నచ్చి ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. పార్టీ విపక్షంలో ఉండగా సీనియర్లను పక్కన పెట్టి మరీ విశాఖ  జిల్లా ప్రెసిడెంట్ కిరీటం అప్పగించారు. ఇక 2014లో డైరెక్ట్ గా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేశారు. నాడు ఓడినా పార్టీలో గుడివాడ జిల్లాలో ఎక్కడా రాజకీయ  ప్రాబల్యం తగ్గలేదు. ఇక 2019 ఎన్నికల వేళ అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. లోకల్ గా ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీని సైతం పక్కన పెట్టి గుడివాడకే పెద్ద పీట వేస్తూ వచ్చారు.

ఇపుడు ఆయనకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీ ప్రెసిడెంట్ ని చేశారు. ఒక విధంగా ఇది ఆనందదాయకమే అయినప్పటికీ తమ నేతను మంత్రిగా చూడాలనుకున్న అనుచరులు మాత్రం కొంత ఆలోచనలో పడ్డారు. గుడివాడకు సైతం అలాగే ఉందిట. తనకు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు అంటే కచ్చితంగా మంత్రి పదవి రేసు నుంచి తప్పించేశారా అని తెగ మధనపడుతున్నారుట.

అయితే ఆయనకు పెద్ద పీట వేసినట్లుగా పార్టీ నాయకులు అంటున్నారు. మరో వైపు చూస్తే మంత్రి వర్గ విస్తరణ చేసే ఉద్దేశ్యం జగన్ కి లేదని, అందుకే తన ప్రియ శిష్యుడికి ఇలా పార్టీ పదవి ఇచ్చి ఒక్క  లెక్కన  ప్రమోషన్ ఇచ్చేశారు అని అంటున్నారు. ఆ విధంగా వచ్చే ఎన్నికల వేళ పార్టీ పరంగా గుడివాడను కీలకంగా చేశారని చెబుతున్నారు. మొత్తానికి తమ నాయకుడు మంత్రి అవుతారు అనుకుంటే పార్టీ ప్రెసిడెంట్ అయ్యారని అభిమానులు మెచ్చుకుంటూనే నొచ్చుకుంటున్నారుట. మరి ఆ లెక్కన చూస్తే విశాఖ జిల్లాలో అవంతి శ్రీనివాసరావే అయిదేళ్ళ మంత్రిగా ఉంటారా. ఏమో వేచి చూడాలి.
Tags:    

Similar News