పార్లమెంటు కళకళలాడిపోతోంది.

Update: 2016-08-02 10:56 GMT
లోక్ సభ అయినా రాజ్యసభ అయినా నిండుగా కనిపించడం చాలా అరుదు. ఎప్పుడూ సగం సీట్లు ఖాళీగానే ఉంటాయి. రెగ్యులర్ గా పార్లమెంటుకు వచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే. కానీ... కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఉభయ సభలు నిండుగా కనిపిస్తున్నాయి. కేంద్రం పట్టుదలగా తీసుకుని ఆమోదం పొందాలని ప్రయత్నిస్తున్న బిల్లులు సభలోకి వస్తుండడం... ఏపీ ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రయివేటు బిల్లు.. ఏపీ ఎంపీల నిరసనలు నేపథ్యంలో సభ్యుల హాజరు అధికంగా ఉంది. దీంతో రెండు సభలూ నిండిపోతున్నాయి.

రాజ్యసభలో జీఎస్‌ టీ బిల్లు ప్రవేశపెట్టి - ఆమోదం పొందే క్రమంలో తమ సభ్యులందరూ మూడు రోజుల పాటు సభలో పూర్తి సమయం ఉండాలని తమ ఎంపీలకు బీజేపీ విప్‌ జారీ చేసింది. కీలక మార్పులతో కేబినెట్‌ ఆమోదం పొందిన సవరణ బిల్లును మంగళవారం లేదా బుధవారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు బిల్లుపై చర్చ, ఓటింగ్‌ సందర్భంగా ఎలా వ్యవహరించాలనే దానిపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు పార్టీ సీనియర్‌ నేతలు పి. చిదంబరం - ఆనంద్‌ శర్మలు వివరించనున్నారు. ఇక తమ అభ్యంతరాలపై కొన్నింటిని ప్రభుత్వం ఆమోదించినా, జీఎస్‌ టీ పన్ను రేటుపై పరిమితి విధించాలన్న కీలక డిమాండ్‌ ను బిల్లులో పొందుపరచలేదని కాంగ్రెస్‌ అసంతృప్తితో ఉంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12తో ముగుస్తుండటంతో ఈలోగా జీఎస్‌ టీ బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వం ఆఘమేఘాలపై కసరత్తును వేగిరం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు బిల్లును అడ్డుకునేందుకు గాను తమ సభ్యలందరినీ పార్లమెంటులో మోహరిస్తోంది.

అలాగే ప్రత్యేక హోదా నిరసనల కారణంగా ఏపీలోని టీడీపీ - వైసీపీ ఎంపీలంతా సభలోనే ఉంటున్నారు. మరోవైపు టీఆరెస్ సభ్యుల హాజరు కూడా ఎక్కువగానే ఉంది. దళితుల సమస్యలు చర్చకొస్తుండడంతో అన్ని రాష్ట్రాలకు చెందిన ఆ వర్గం ఎంపీలు.. బీఎస్పీ సభ్యులు కూడా పార్లమెంటులోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. ఈ అన్ని కారణాల వల్ల పార్లమెంటులో సభ్యు హాజరు ఒక్కసారిగా పెరిగింది.
Tags:    

Similar News