శ్రీలంక అధ్యక్షుడిగా గోటాబయ రాజపక్సే

Update: 2019-11-17 12:54 GMT
తాజాగా జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్సే విజయం సాధించారు.  ఆయన్ను శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత.. కౌంటింగ్ లోని ప్రతి దశలోనూ ఆయన తన అధిక్యతను స్పష్టంగా కనబర్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన్ను శ్రీలంక అధ్యక్షుడిగా ఎంపికైనట్లు ప్రకటించారు. తన ప్రత్యర్తి అధికార యూఎన్ పీ నేత సజిత్ ప్రేమదాసపై పైచేయి సాధించారు.

ఇంతకీ ఎవరీయన? ఇప్పటివరకూ ఏం చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. గోటా బయ రాజపక్సే ఎవరో కాదు.. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే సోదరుడు.  70 ఏళ్ల వయసులో ఆయన శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. యాబై శాతం కంటే ఎక్కువ ఓట్లను సొంతం చేసుకున్న ఆయన.. శ్రీలంక పొడుజన పెరమున (పొట్టిగా చెప్పాలంటూ ఎస్ఎల్పీపీ) పార్టీ తరఫున బరిలోకి దిగారు. రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా పని చేసిన ఆయనకు వివాదాస్పద నేతగా గుర్తింపు ఉంది.

శ్రీలంక ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేయటానికి ముందే ఆయన తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకోవటం విశేషం. 2008-09లొ తమిళ వేర్పాటువాదన గెరిల్లాలతో తుదివిడత పోరుతో తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడినట్లుగా ఆయనపైన ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నికల ప్రచారంలో సింహళీయులు.. జాతీయవాదాన్ని ప్రచారంగా చేసుకన్న ఆయన.. మెజార్టీ కమ్యునిటీగా ఉన్న సింహళీయుల అభిమానాన్ని చూరగొన్నారు. సింహళీయులు ఆయనకు దన్నుగా నిలవగా.. ఆయనకు వ్యతిరేకంగా మైనార్టీలైన తమిళులు.. ముస్లింలు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. చైనా అనుకూల విధానాల్ని ఆయన అమలు చేస్తుంటారు. అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గొటబయ రాజపక్సేకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ట్వీట్ తో శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాలు సోదరభావంతో కలిసి పని చేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దీనికి ఆయన స్పందించారు. మోడీకి ట్వీట్ కు థ్యాంక్స్ చెప్పరు. సమీప భవిష్యత్తులో మోడీని కలుసుకునేందుకు తాను ఎదురుచూస్తానని ప్రకటించి.. ప్రధానిపై తనకున్న అభిమానాన్ని ప్రదర్శించారు.


Tags:    

Similar News