గంగుల తొందరపడుతున్నారా?

Update: 2019-09-10 11:26 GMT
సంతోషం మంచిది. ఆ సందర్భంగా వచ్చే మాటలతోనే అసలు చిక్కంతా. సంతోషంగా ఉన్నప్పుడు అవసరానికి మించిన మాటలు మాట్లాడటం అందరూ చేసేదే. ఇందుకు తాజాగా కేసీఆర్ కేబినెట్ లో మంత్రి ఛాన్స్ సొంతం చేసుకున్న గంగుల కమలాకర్ లాంటోళ్లు మినహాయింపు కాదు. తాజాగా ఆయన మాంచి మూడ్ లో ఉన్నారు. విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ.. కరీంనగర్ కు ఇప్పటికే మంత్రి పదవులు ఇచ్చినా.. గంగులను సైతం చేర్చుకోవటంతో ఆయన ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయిన పరిస్థితి.

దీంతో ఆయన తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజమే.. మంత్రి పదవిని సాధించిన తర్వాత గొప్పలు చెప్పుకోవటం తప్పేం కాదు. కానీ.. తాను చెప్పే గొప్పలు తన బాస్ కేసీఆర్ కు చిరాకు పుట్టిస్తాయన్న విషయాన్ని ఆయన మర్చిపోవటం అసలు సమస్య అంటున్నారు. కరీంనగర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్న గంగుల.. తాజాగా మంత్రి బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకోవటం.. ప్రమాణస్వీకారం పూర్తి చేయటం తెలిసిందే.
Read more!

తాజాగా మంత్రివర్గ విస్తరణతో కరీంనగర్ జిల్లాకు మొత్తం నాలుగు మంత్రి పదవులు లభించగా.. వినోద్ కు ఉన్న కేబినెట్ ర్యాంకును కలిపితే జిల్లాకు మొత్తం ఐదు పదవుల్ని ఇవ్వటం కనిపిస్తుంది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాకు మొత్తంగా ఐదు కేబినెట్ పదవులు గతంలో ఎప్పుడూ లభించలేదంటున్నారు. అయితే.. ఇదంతా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో.. జిల్లాను బలోపేతం చేయటానికి.. కమలనాథుల జోరుకు కళ్లెం వేయటానికన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. గంగుల చేస్తున్న తప్పేమిటంటే.. తెలంగాణ సాధనలో తాను కీలకమని.. తన కారణంగానే టీడీపీ లేఖ ఇచ్చిందని.. తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిన తర్వాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందంటూ.. తెలంగాణ రాక మొత్తం ఎపిసోడ్ తన చుట్టూనే తిరిగినట్లుగా బిల్డప్ ఇవ్వటం ఆయనకు విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తుందన్న మాటను చెబుతున్నారు.

2009లో తాను టీడీపీ నుంచి గెలిచి.. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో తాను టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్ లో చేరానని.. అప్పుడే చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. ఒక విధంగా తెలంగాణ రాకలో తాను కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్న గంగుల మాటలు గులాబీ బాస్ కు మంట పుట్టేలా చేస్తాయన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిందంటున్నారు. సంతోషంలో మాట్లాడటం తప్పేం కాదు కానీ.. కేసీఆర్ సారుకు కోపం వచ్చేలా మాట్లాడటమే తప్పని.. ఆ విషయాన్ని గంగుల ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు.
Tags:    

Similar News