పీకే నయా స్ట్రాటజీ..వెనకున్నది అమిత్ షానేనా?

Update: 2019-12-06 01:30 GMT
ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తులు పొడిచే సూచనలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఎలాగైనా బలపడాల్సింద - అధికారం చేజిక్కించుకోవాల్సిందేనన్న కసితో సాగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మునుపటి వ్యూహానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం విషయంలో పవన్ మాదిరి వ్యూహంతోనే సాగుతున్న బీజేపీ... అందుకోసం తనకు అనుకూలంగా ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. మొత్తంగా ఇటు పవన్ దీ - అటు బీజేపీదీ ఒకటే వ్యూహమని చెప్పక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో పవన్ సరికొత్తగా హిందూత్వ భావజాలాన్ని భుజానికెత్తుకున్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే... జనసేన - బీజేపీ కలిసిపోవడం గ్యారెంటీనేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా... సమీప భవిష్యత్తులోనే ఈ రెండు పార్టీల మధ్య సరికొత్త పొత్తు పొడిచే అవకాశాలు లేకపోలేదన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇంతదాకా బాగానే ఉన్నా... అసలు బీజేపీ చెంతకు పవన్ చేరుతున్నారా? లేక బీజేపీనే పవన్ తో పొత్తుకు పావులు కదుపుతోందా? అన్నది అమితాసక్తి కలిగించే అంశమని చెప్పాలి. గత నెలలో ఢిల్లీ టూర్ అంటూ రెండు రోజులు అక్కడికి సమీపంలో గడిపిన పవన్... ప్రధాని నరేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కార్యద్యక్షుడు జేపీ నద్దాలతో భేటీ అవుతారని అంతా అనుకున్నారు. అయితే వారితో పవన్ భేటీ అయితే కాలేదు గానీ... బీజేపీ అధిష్ఠానం పంపిన దూతలతో పవన్ భేటీ అయ్యారని - అంతేకాకుండా అమిత్ షా - జేపీ నద్దాలతో పవన్ రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. ఈ భేటీల ప్రభావమో? ఏమో? తెలియదు గానీ... ఢిల్లీ టూర్ ముగించుకుని వచ్చనంతనే పవన్ హిందూత్వ వాదాన్ని ఎంచుకున్నారు. అప్పటిదాకా కొనసాగించిన తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసిన పవన్... హిందూత్వ వాదిలా మారిపోయి... వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మతం - కులం ఆధారంగా దాడి చేయడం మొదలెట్టేశారు.

ఈ తరహా కొత్త వైఖరికి కొనసాగింపుగా తాను ఏనాడూ బీజేపీకి దూరం కాలేదని - ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే విభేదించానని సరికొత్త కామెంట్ చేశారు. ఆ తర్వాత అమిత్ షా లాంటి నేతలే ఇప్పుడు దేశానికి కావాల్సిన వారు అంటూ మరో సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలతో తాను భవిష్యత్తులో బీజేపీతో జట్టు కట్టడం ఖాయమేనన్న ఫీలర్లను పవన్ వదిలేశారని చెప్పాలి. అంతేకాకుండా పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లుగా బీజేపీ నేతలు కూడా పవన్ తమ వద్దకు వస్తే స్వాగతిస్తామని చెప్పడం మరింత ఆసక్తి రేకెత్తించేదే. మరి పవన్ మారిన వ్యూహం మొత్తం అమిత్ షా చేతుల్లోనే రూపొందిందా? అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. పవన్ బీజేపీ వద్దకు వెళ్లాలని అనుకున్నా, పవన్ తమకు కావాలని బీజేపీ అనుకున్నా... మొత్తంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అయితే ఖాయమైపోయిందనే చెప్పాలి. చూద్దాం... జనసేనను పవన్ బీజేపీలో విలీనం చేస్తారా? లేదంటే పొత్తుతోనే సరిపెడతారో?

   

Tags:    

Similar News