బీ అలర్ట్.. అందం కోసం ఆశపడితే.. ప్రాణాలకే ప్రమాదం!

Update: 2023-05-30 05:00 GMT
ఆడవారు తమ అందం కోసం ఎంతటి సాహసాన్ని చేసేందుకైనా.. కష్టపడేందుకైనా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా ఈ తరం అమ్మాయిలు అందానికి ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే బరువు అనేది అందంపై చాలా ప్రభావం చూపుతోంది. ఈ తరం వారు బరువు పెరగకుండా ఉండేందుకు ఎన్నో నియమాలు పాటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బరువు పెరిగిన వారు తగ్గేందుకు ఎన్నో చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.

ఆపరేషన్ చేయించుకుని బరువు తగ్గించుకునే వారు చాలా మంది ఉన్నారు. అలా బరువు తగ్గడం కోసం ఆపరేషన్ చేసుకున్న వారు కొందరు బాగానే ఉన్నా.. మరి కొందరు మాత్రం మృతి చెందారు. శరీరంలోని ఒక భాగం లేదా రెండు భాగాలు లేదా ఏదైనా అవయవానికి సంబంధించి ఆపరేషన్ చేయించుకోవడం కామన్ విషయం.

అయితే శరీరంలో పేరుకు పోయిన కొవ్వును తొలగించడం కోసం కొన్ని ఆపరేషన్ లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఆపరేషన్ కారణంగా అత్యంత ప్రమాదకర జబ్బులు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల అమెరికాలో ఇద్దరు లైపొ సెక్షన్ చేయించుకోగా మెనింజైటిస్‌ తో మరణించినట్లుగా తెలుస్తోంది.

మరో 25 మంది కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అమెరికా ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. చర్మం దిగువన కొవ్వును తీసే క్రమంలో ఫంగస్ శరీరంలోకి చొరబడి కణాలు ఉబ్బిపోయేలా చేస్తుంది. ఫలితంగా మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు అంటున్నారు.

సహజ పద్ధతిలో బరువు తగ్గితే పరవాలేదు.. కానీ అలా ఆపరేషన్ తో తగ్గాలి అనుకోవడం కచ్చితంగా ప్రమాదమని.. వెంటనే కాకున్నా భవిష్యత్తులో అయినా ప్రాణాలకు ప్రమాదం అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పుట్టుకతో వచ్చిన అందాన్ని కాపాడుకోవాలి.. అంతే కాని లేని దాని గురించి ఆరాటం అవసరం లేదు. ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి అంతే కానీ అదనపు అందం కోసం, ఆర్భాటాల కోసం ఆపరేషన్ చేయించుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Similar News