అమరావతికి ఎస్టీడీ, ఐఎస్డీ కోడ్ లు... కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతపై ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న వేళ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతపై ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న వేళ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ తరలించడానికి వీల్లేకుండా వట్టబద్దత కల్పించేందుకు కేంద్రం అంగీకరించిందని.. 2024 నుంచే ఈ చట్టబద్ధతను అమల్లోకి తెస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని అన్నారు.
అవును... అమరావతి చట్టబద్దతపై కేంద్రమంత్రి పెమ్మసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2024 ఏడాది నుంచే ఈ చట్టబద్ధతను అమల్లోకి తెస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో.. దీనికి సంబంధించి అటార్నీ జనరల్ తో కూడా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా రాజధానిలో త్వరలో స్పెషల్ పిన్ కోడ్ మంజురు చేయబోతున్నామని అన్నారు.
ఇదే సమయంలో... ఎస్.టీ.డీ, ఐ.ఎస్.డీ కోడ్ లను మంజూరు చేయబోతున్నామని చెప్పిన పెమ్మసాని.. విభజన చట్టంలో మంజూరై, అమరావతికి కేటాయించిన అన్ని కేంద్ర సంస్థలతో చర్చలు జరిపి వాటి ఆఫీసుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను పర్యవేక్షించే తపాలా శాఖ హెడ్ ఆఫీసు పనులు మరో మూడు నెలల్లో రాజధానిలో ప్రారంభమవుతాయని.. రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ కాంప్లెక్సులు, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారులు, సిబ్బంది నివాస సముదాయాలను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇవి పూర్తయితే ప్రజలు ఇక్కడకు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన వాతావరణం కలుగుతుందని.. ఈలోపు రాజధానికి అవసరమైన కనెక్టివిటీని పెంచేందుకు అవసరమైన పనులు చేపడతామని తెలిపారు.
ఇదే క్రమంలో... ఎల్పీఎస్ లేఅవుట్ల పనులు పూర్తయితే భవన నిర్మాణాలకు అనుమతులు వస్తాయని.. ప్లాట్ల సైజులను తగ్గిస్తే హైదరాబాద్ లోని మరో పాతబస్తీలా మారుతుందని.. అలా కాకుండా ప్రపంచ స్థాయి నగరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని కేంద్రమంత్రి పెమ్మసాని కోరారు.
కాగా... కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతిలోని విట్ ఏపీ క్యాంపస్ లో జెన్-జెడ్ పోస్టాఫీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... జెన్-జెడ్ పోస్టాఫీసులో ఆధునిక వాతావరణం, డిజిటల్ చెల్లింపుల సదుపాయాలు, ఒకేచోట పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలు పొందే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రైవేటు కొరియర్ సర్వీసులకు దీటుగా పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని తెలిపారు.