కేసీఆర్ కు గట్టిగానే ఇచ్చిపడేసిన రేవంత్, ఉత్తమ్, కాంగ్రెస్ బ్యాచ్
తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.;
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఉదాహరణలతో సహా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ను కడిగేసిన కేసీఆర్ పై కౌంటర్ కూడా గట్టిగానే ప్రతిస్పందన వచ్చింది.
తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ వైఖరిని ‘ఆర్థిక ఉగ్రవాదం’గా అభివర్ణిస్తూ .. ఆయన కుటంబ రాజకీయాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల చేశారు.
పార్టీ వారసత్వ పోరు అంటూ రేవంత్ కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బయటకు రావడం వెనక రాష్ట్ర ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. తన అల్లుడు హరీష్ రావు చేతుల్లోకి పార్టీ వెళుతుందనే భయంతోనే తన కుమారుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును కాపాడడానికి కేసీఆర్ బయటకు వచ్చారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ చావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని.. ఆయన ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షిస్తున్నానని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్ కు బయటి వ్యక్తుల కంటే ఆయన కుటుంబ సభ్యుల నుంచే ముప్పు ఉందని..కుర్చీ కోసం కొడుకు, అల్లుడు ఆయన చావును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి నిర్బంధించారని రేవంత్ ఆరోపించారు.
ఆర్థిక, రాజకీయ అంశాలపై ధ్వజం
రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆర్థికంగా అత్యాచారం చేసిందని.. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎన్ని ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా కేసీఆర్ తీరులో మార్పు లేదని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ తమలపాకుతో కొడితే.. నేను తలుపు చెక్కతో కొట్టే రకం’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని రేవంత్ సవాల్ విసిరారు. అధికారంపై ఉన్న వ్యామోహం ప్రజలపై లేదని అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదని పేర్కొన్నారు.
కేసీఆర్ మాటల్లో 90 శాతం అబద్దాలే : మంత్రి ఉత్తమ్
నీటి పారుదల అంశాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పదేళ్ల అధికారంలో దేవాదుల , ఎస్.ఎల్.బీసీ , దిండి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు అందించారా? అని నిలదీశారు. 1.80 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని.. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఉత్తమ్ మండిపడ్డారు. ఉద్యమాలు చేసేముందు ,రాష్ట్రాన్ని నాశనం చేసినందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది గత ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నీటి పారుదల రంగాన్ని అస్తవ్యస్థం చేసిన కేసీఆర్ ఇప్పుడు కేవలం తన వారసుల రాజకీయాల కోసమే బయటకు వచ్చి అబద్దాలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా విమర్శించారు. మొత్తంగా కేసీఆర్ కౌంటర్ కు, ఉత్తమ్, రేవంత్ రీకౌంటర్ తో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వార్ యమ రంజుగా సాగుతోంది.