భారత్ నుంచి విద్యార్థి వీసాపై వెళ్తే.. బెదిరించి వార్ కి పంపించారు!

అవును... విద్యార్థి వీసాపై చదువు కోసం వెళ్లిన వారిని రష్యా బ్రతిమాలో, బెదిరించో సైన్యంలో చేరుస్తుందనే విషయం తాజాగా అధికారికంగా వెలుగులోకి వచ్చింది.;

Update: 2025-12-22 04:58 GMT

ఉక్రెయిన్ తో రష్యా అవిరామంగా యుద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అటు ఉక్రెయిన్ కానీ ఇటు రష్యా కానీ ఏమాత్రం తగ్గడం లేదు! ఈ క్రమంలో రష్యా భారీగా సైన్యాన్ని కోల్పోయిందని చెబుతున్నారు.. ఈ దెబ్బతో ఆ దేశంలోని యువత ఆర్మీకి వెళ్లాల్సి వస్తుందనే కారణంతో దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు.

ఏడాది పాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడేవరికి కోటి రూబుల్స్ (సుమారు రూ.80 లక్షలు) రుణమాఫీ చేయడానికి సిద్ధపడి, కొత్త చట్టాన్ని గత ఏడాది నవంబర్ లో తెచ్చినప్పటికీ ఆ దేశ యువత మాట వినని పరిస్థితి. ఈ సమయంలో ఉత్తర కొరియా సైన్యం పరంగా కొంత సహకరిస్తున్నా.. అదీ చాలడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి వీసాలపై వెళ్లినవారిని సైన్యంలోకి పంపుతున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... విద్యార్థి వీసాపై చదువు కోసం వెళ్లిన వారిని రష్యా బ్రతిమాలో, బెదిరించో సైన్యంలో చేరుస్తుందనే విషయం తాజాగా అధికారికంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో బలైపోయింది ఓ భారతీయుడు కావడం గమనార్హం. భారత్ - రష్యా సంబంధాలు అద్భుతః అని చెబుతోన్న వేళ.. ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆ విద్యార్థి తనను వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వ సహాయం కోరుతున్నాడు.

వివరాళ్లోకి వెళ్తే... గుజరాత్ లోని మోర్బీకి చెందిన సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ విద్యార్థి వీసాపై చదువు కోసం రష్యా వెళ్లాడు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో సందేశం పంపించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా సైన్యంలో చేరవద్దని ప్రజలను అభ్యర్థించాడు. తనను తప్పుడు డ్రగ్స్ కేసుతో బ్లాక్ మెయిల్ చేసి, రష్యా సైన్యంలో పనిచేయాలని బలవంతం చేశారని.. ఉక్రెయిన్ దళాలకు పట్టుబడిన తర్వాత అక్కడే ఉన్నట్లు తెలిపాడు.

ఈ నేపథ్యంలో తాను స్వదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయమని భారత ప్రభుత్వాన్ని కోరాడు. తనను బ్లాక్ మెయిల్ చేసి, రష్యా సైన్యంలో ఫ్రంట్ లైన్ లో ఉంచారని.. ఆ తర్వాత తాను చేసిన మొదటి పని.. ఉక్రెయిన్ సైన్యానికి లొంగిపోవడమె అని హుస్సేన్ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ విడియోను ఉక్రెయిన్ దళాలు గుజరాత్ లోని అతని తల్లికి పంపించి.. రష్యన్ సైన్యంలో సేవ చేయడానికి భారతీయులను మోసగించడం గురించి అవగాహన పెంచమని ఆమెను కోరాయి.

దీంతో... తన కొడుకుని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని కోరుతూ ఆమె ఢిల్లీలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ ఫిబ్రవరిలో ఉంది. ఇదే సమయంలో.. రష్యాలో చిక్కుకున్న భారతీయుల కుటుంబాలు.. తా ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు.

Tags:    

Similar News