ఆ మాజీ సీఎం మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తారా !

Update: 2021-08-27 12:30 GMT
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దీనికి ప్రధాన కారణం సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ గా విడిపోక ముందు సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఈయనే. వై ఎస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత కొన్ని నెలలకి అనూహ్యంగా రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అనుకోకుండా ఏకంగా ముఖ్యమంత్రి పదవి వరించడంతో తనదైన పాలనతో రాష్ట్రంలో చెరగని ముద్రవేయాలని ప్రయత్నాలు చేశారు. అయన హయం లో రైతుల కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలు కూడా తీసుకువచ్చాడు.

అయితే , ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే  రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయింది. రాష్ట్రం విడిపోతే ఎన్నో సమస్యలు వస్తాయని ఈయన చివరి వరకు సమైక్య రాష్ట్రమే కావాలంటూ తన వాణిని వినిపించారు. కానీ , అది కుదరలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి సమైక్య అంధ్రా అంటూ పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీకి పెట్టారు. అయితే , ఏ ఒక్క చోట కూడా అయన పెట్టిన పార్టీ కొంచెమైనా ప్రభావం చూపలేకపోయింది.ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకి చాలా కాలం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరినట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. ప్రస్తుతం అయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారని భావించాలి.

ఎందుకంటే , హైదరాబాద్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి , కొందరు విశాఖ కాంగ్రెస్  అదేపనిగా వచ్చి కలిసి వెళ్లారు.  విశాఖ జిల్లా రాజకీయాల గురించి కిరణ్ కుమార్ రెడ్డి తో చర్చించినట్లుగా పీసీసీ ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లాకు చెందిన బొడ్డు శ్రీనివాస్ చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన్ని కలవడం, ఆయన కూడా మాట్లాడడం వంటి సీన్స్ చూస్తుంటే , మళ్లీ అయన అతి త్వరలోనే    ఏపీ పీసీసీ చీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటారా అన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతుంది. కాంగ్రెస్ నేతలు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ  పీసీసీ చీఫ్ గా వచ్చి , కాంగ్రెస్ కి పూర్వవైభవం తీసుకొస్తారు అని చర్చించుకుంటున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ యాక్టీవ్ అవుతారా లేదా అనే దాని కంటే ముందు అసలు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే దానిపై  చర్చ జరగాలి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ లో కీలక బడా నేతలు మొత్తం  ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఓ పేరున్న బడా నేత కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో లేరు. ప్రస్తుతం దీనిపై అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఇన్ని అడ్డంకులు , సమస్యల మధ్య ఏపీ పీసీసీ చీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నా కూడా పార్టీని ఎంతమేర ప్రజల్లోకి తీసుకువెళ్తాడు అనేది సమాధానం లేని ప్రశ్న.

ఇదిలా ఉంటే .. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నారు అని గతంలో కూడా పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఆ వార్తలపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ..  తనను నియమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు. చూడాలి మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తో మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తారో ?రారో ?
Tags:    

Similar News