తుదిశ్వాస విడిచిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

Update: 2021-07-08 05:30 GMT
గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరభద్రసింగ్ సోమవారం గుండెపోటు కు గురయ్యారు. దీనితో అయన పరిస్థితి మరింత దిగజారింది. అయితే , ఆస్పత్రి వర్గాలు వెంటనే వెంటిలేటర్‌ పైకి తరలించి చికిత్స అందిస్తుండగా ఈ  తెల్లవారుజామున కన్నుమూశారు.  గురువారం తెల్లవారుజామున 03.40 గంటలకు వీరభద్రసింగ్ కన్నుమూసినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ జనక్ రాజ్ తెలిపారు.

మాజీ సీఎం  వీరభద్ర సింగ్  మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ సంతాపం ప్రకటించారు. ఇదిలా ఉంటే .. వీరభద్రసింగ్‌ రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు కరోనా  మహమ్మారి చేతికి చిక్కారు. మొదట ఏప్రిల్ 12న ఆయన కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సూచనలతో మొహాలీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో ఏప్రిల్ 23న డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత  మొహాలీ నుంచి సిమ్లాకు వెళ్లారు. సిమ్లాకు రాగానే శ్వాస సంబంధ సమస్యలు రావడంతో ఐజీఎంసీకి తరలించారు. ఆ తర్వాత జూన్ 11న కూడా మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం విషమించింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం కన్నుమూశారు.
Read more!

మాజీ సీఎం వీరరభద్ర సింగ్ తన రాజకీయ జీవితంలో మొత్తంగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్‌ కు 6 సార్లు సీఎంగా పనిచేశారు. 1983 ఏప్రిల్ 8 నుంచి 1990 మార్చి 5 వరకు, ఆ తర్వాత 1993 డిసెంబరు 3 నుంచి 1998 మార్చి 23 వరకు, అనంతరం 2003 డిసెంబరు 29 నుంచి 2007 డిసెంబరు 29, ఆ తర్వాత 2012 డిసెంబరు 25 నుంచి 2017 డిసెంబరు 26 వరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 1998 మార్చి నుంచి 2003 మార్చి వరకు ప్రతిపక్ష నేతగానూ పనిచేశారు. వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య కూడా రాజకీయనేతలే. ప్రతిభా సింగ్ మాజీ ఎంపీ కాగా , ఆయన కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Tags:    

Similar News