జాతీయ జెండా వివాదంలో వెంక‌య్య‌

Update: 2016-07-30 11:12 GMT
జాతీయ ప‌తాకం అంటే దేశ ప్రథమ పౌరుని నుంచి సామాన్యుడి వరకూ ఎంతో గౌరవం. దాని గొప్పతనం గురించి తెలియకపోతే తెలుసుకుంటుంటారు. అలాంటిది నిరంతరం భారతీయత - దేశభక్తి అంటూ గొప్పలు చెప్పే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నడుపుతున్న అక్షర విద్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఆ పాఠశాల భవనంపై నిరంతరం జెండా ఎగురుతూనే ఉంది. వర్షానికి తడుస్తూనే ఉంది. కేంద్ర - రాష్ట్ర మంత్రులు - జిల్లా - మండల స్థాయి అధికారులు ఇక్కడకొచ్చి పోతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యాన అక్షర విద్యా సంస్థ నడుస్తోంది. అక్కడ పాఠశాల భవనం 12 రోజులుగా జాతీయ జెండా ఎగురుతూనే ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అలా నిరంతరం ఎగరకూడదు. 1968లో బ్యూరో ఆఫ్‌ ఇండిఎస్‌ స్టాండర్డ్స్‌ (భారత ప్రమాణాల కమిటీ) మూడు దశల్లో జాతీయ జెండాకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. 2008లో కొన్ని మార్పులు చేసి వాటిని మరింత పటిష్టం చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 51ఎ లో ఆ నిబంధనలను పొందుపరిచారు. జాతీయ జెండా 9 పరిమాణాల్లో మాత్రమే ఉండాలి. కొలతల్లో తేడా ఉండకూడదు. ఏటా జెండాను ఆగస్టు 15 - జనవరి 26 - గాంధీజయంతి అక్టోబర్‌ 2 - రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఎగుర వేయాలి. అదీ సూర్యోదయం తర్వాతే. సూర్యాస్తమయం తరువాత అవనతం చేయాలి. ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల వరకే జెండాను ఎగురవేయాలి. దేశంలో పార్లమెంటు భవనం - ఎర్రకోట - రాష్ట్రపతి భవన్‌ - సుప్రీం కోర్టు తదితర భవనాలపై ఎగురవేయొచ్చు. ఎక్కువ గాలి - వర్షాల్లో ఎగురవేయకూడదు.

కానీ ఇవ‌న్నీ వెంక‌య్య సార‌థ్యంలోని అక్షర విద్యాలయంలో అమ‌లుకావ‌డం లేదంటున్నారు. సుమారు 12రోజులుగా జాతీయ జెండా నిరంతరం ఎగురుతూనే ఉంది. జెండా హుందాగా ఎగరాల్సి ఉండ‌గా ఎక్కువ గాలి వీస్తుండడంతో అప్పుడప్పుడు పోల్‌ కు జెండా చుట్టుకుపోతోంది. ఇటీవల అడపాదడపా వస్తున్న వర్షానికి తడిచి ముద్దవుతోంది. రాత్రి వేళల్లో ఎగురుతూనే ఉంది. ప్రైవేటు విద్యాలయంలో నిరంతరం జెండా ఎగురేయడం దేశభక్తికి విఘాతం కలిగించడమేనని పలువురు అంటున్నారు. జెండాను అలంకార ప్రాయంగా వాడుతున్నారని వాపోతున్నారు. ఈనెల 24వ తేదీన రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు - విద్యా సంస్థ నిర్వాహకులు - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు - రాష్ట్రమంత్రి నారాయణ కలసి ఇక్కడ సమావేశం నిర్వహించారు. వారికి జాతీయ జెండా స్థితి కన్పించకపోవడం శోచనీయమ‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. జెండా ఎగురుతోంది కేంద్రమంత్రికి చెందిన భవనం కావడంతో అధికారులు సైతం నోరు మెదపలేక మౌనం దాల్చారు. ఇకనైనా ఆ జెండాను అవనతం చేయాలని పలువురు దేశభక్తులు కోరుతున్నారు.
Tags:    

Similar News