హైదరాబాద్ కు ఏమైంది? ఒకే రోజు ఒకే చోట 5మహిళలు సూసైడ్ అటెంప్టు

Update: 2021-08-14 06:31 GMT
హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. నగరానికి చెందిన ఐదుగురు వేర్వేరు మహిళలు ఒకే రోజున ఒకే చోట ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయటం తాజా కలకలంగా మారింది. హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాల విషయానికి వస్తే.. వెనుకా ముందు ఆలోచించకుండా అందరూ చెప్పే ఒక ప్లేస్ హుస్సేన్ సాగర్. నగరం నడిబొడ్డున ఉండే ఈ లేక్.. కాంక్రీట్ జంగిల్ నుంచి కాస్తంత రిలీఫ్ ను ఇస్తుందని చెప్పాలి. హైదరాబాద్ మహానగరానికి ఎన్ని కొత్త అందాలు వచ్చినా.. హుస్సేన్ సాగర్ అందాలకు ధీటుగా నిలిచేది మాత్రం రాలేదు.. ఎప్పటికి రాలేదనే చెప్పాలి.

ఇంతటి అందమైన హుస్సేన్ సాగన్ వద్దకు సేద తీరే వారు నిత్యం పెద్ద ఎత్తున వస్తుంటారు. అదే సమయంలో.. ఇదే హుస్సేన్ సాగర్ లోకి దూకి తమ ప్రాణాల్ని తీసుకోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. అప్పుడప్పుడు చోటు చేసుకునే ఈ ఘటనలు కలకలం రేపుతుంటాయి. అయితే.. ఇలా ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండేందుకు వీలుగా.. బాధితులకు సాయం అందించేందుకు.. ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం లేక్ పోలీసింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సిబ్బంది నిత్యం హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. డేగ కన్నువేసి.. ఆత్మహత్యలకు పాల్పడే వారిని కాపాడుతూ ప్రాణాలు పోకుండా ప్రయత్నం చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఏమైందో ఏమో కానీ.. ఎప్పుడూ లేని రీతిలో ఒకే రోజులో ఒకే ప్రాంతంలో ఐదుగురు వేర్వేరు మహిళలు ఆత్మహత్య యత్నం చేసుకోవటం తీవ్ర కలకలాన్ని రేపింది. అయితే.. ఈ ఐదుగురు మహిళల్ని అక్కడి లేక్ పోలీసులు గుర్తించి కాపాడారు.

తాజాగా ఆత్మహత్యలకు పాల్పడిన ఐదుగురు మహిళలకు సంబంధించిన వివరాల్ని చూస్తే.. ఇద్దరు భర్త వేధింపులకు తాళలేక డిప్రెషన్ తో సూసైడ్ అటెంప్టు చేయగా.. మరో మహిళ ఆర్థిక సమస్యల్ని అధిగమించలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. మరో యువతి మద్యానికి బానిసై.. కుటుంబ సమస్యలతో హుస్సేన్ సాగర్ లోకి దూకింది. ఐదో మహిళ ప్రేమ విఫలమైన నేపథ్యంలో సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. వీరందరి ప్రయత్నాల్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు సకాలంలో స్పందించటంతో వారా ప్రాణాల్ని కాపాడారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఏమైనా ఒకే రోజులో ఇంతమంది ఆత్మహత్యాయత్నాలకు ప్రయత్నించటం సంచలనంగా మారింది.





Tags:    

Similar News