తాజా సీన్ చూశారా? దేశ రాజకీయాల్ని పాతబస్తీ ప్రభావితం చేయనుందా?

Update: 2020-11-12 06:00 GMT
మత రాజకీయాలతో అధికారాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చన్న విషయంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎవరూ ప్రత్యేకంగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే.. ఆయనే దేశానికి తనదైన  శైలిలోరాజకీయ పాఠాలు నేర్పే సత్తా ఉన్న వారు. పాతబస్తీ ఫార్ములాను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని.. తానో నిర్ణయాత్మక రాజకీయ శక్తి కావాలన్నదే అసద్ ఆలోచన. అందుకు తగ్గట్లే.. ఆ మధ్య వరకు హైదరాబాద్ పాతబస్తీకి పరిమితమైన అసద్.. కొన్నేళ్లుగా వేర్వేరు రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తున్నారు.

ఎక్కడైతే మైనార్టీ ఓటర్లు ఎక్కువ ఉంటారో.. టార్గెట్ చేసి మరీ అక్కడ పోటీ చేయటం.. ఎన్నికల ప్రచారంలో తమదైన శైలిలో ఆవేశపూరిత ప్రసంగాలతో మనసును దోచుకునే టాలెంట్ అసద్ లో ఎక్కువే. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాన్ని అమలు చేయటం ద్వారా ఐదు అసెంబ్లీ స్థానాల్ని ఆయన సొంతం చేసుకున్నారు.

తాజాగా మజ్లిస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు వచ్చారు. పార్టీ అధినేత అసద్ ను కలిసేందుకు వారు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో వారికి మజ్లిస్ నేతలు ఘన స్వాగతం పలికారు. వీరంతా తమ అధినేతతో భేటీ కావటంతో పాటు.. రానున్న రోజుల్లో  ఎలా వ్యవహరించాలన్న అంశంపై వ్యూహాన్ని సిద్ధం చేయనున్నట్లు చెబుతున్నారు. అసద్ అనుకున్నట్లు జరిగితే రానున్న రోజుల్లో హైదరాబాద్ పాతబస్తీ జాతీయ రాజకీయాల్ని అంతో ఇంతో ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు కనిపించట్లేదు?
Tags:    

Similar News