2029 లో పోటీకి రెడీ అంటున్న లక్ష్మీ పార్వతి
లక్ష్మీ పార్వతి వైసీపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె గత పదిహేనేళ్ళుగా ఆ పార్టీతోనే కొనసాగుతున్నారు.;
లక్ష్మీ పార్వతి వైసీపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె గత పదిహేనేళ్ళుగా ఆ పార్టీతోనే కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆమె ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కొన్నాళ్ళు నడిపారు. దాని కంటే ముందు ఎన్టీఆర్ తో కలసి 1994 ఎన్నికల్లో ప్రచారం చేశారు. మూడవసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఎనిమిది నెలలు పాలించిన సమయంలో ఎక్కువగా లక్ష్మీ పార్వతి పేరు మారు మోగింది. ఇవన్నీ చరిత్ర అనుకుంటే వైసీపీ నుంచి లక్ష్మీ పార్వతి అవసరమైన సందర్భాలలో మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు.
పార్టీ ఆదేశిస్తే :
తాను 2029 ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద లక్ష్మీ పార్వతి తాజాగా ఒక డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తనకు నిజానికి పోటీ చేయాలన్న ఆసక్తి అయితే లేదని అన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే మాత్రం తాను పోటీకి సిద్ధమే అని స్పష్టం చేశారు ఇక 2014 ఎన్నికల్లో తనకు జగన్ పోటీకి అవకాశం ఇచ్చారు కానీ తన దగ్గర డబ్బులు లేక సీటు వదిలేసుకున్నాను అని చెప్పారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో పార్టీ అధికారంలో ఉన్నపుడు తెలుగు అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు. ఇపుడు కూడా యువతకు పోటీ చేసేందుకు అవకాశాలు రావాలని ఆమె అన్నారు. తాను పోటీ చేయడం అన్నది ప్రధానం కాదని అన్నారు. అదే సమయంలో తన అవసరం ఉందని పార్టీ భావించి పోటీ చేయమంటే రెడీ అని చెప్పారు.
కూటమి పాలన మీద :
ఏపీలో టీడీపీ కూటమి పాలన ఏ మాత్రం బాగులేదని ఆమె చెప్పడం విశేషం. రెండేళ్ల పాలనలోనే జనాలలో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టేశారని మహిళల మీద అత్యాచారాల నుంచి అన్ని రకాలైన అఘాయిత్యాలు ఏపీలో జరుగుతున్నాయని అన్నారు. ఏపీలో వనరుల దోపిడీ సాగుతోందని అవినీతి పెరిగిందని ఆమె మండిపడ్డారు.
ఈవీఎంల వల్లనే :
మరో వైపు 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఈవీఎంలను మేనేజ్ చేయడమే ప్రధాన కారణంగా భావిస్తున్నామని లక్ష్మీ పార్వతి చెప్పడం విశేషం. ఇది తాము అన్నది కాదని పరకాల ప్రభాకర్ లాంటి మేధావులే ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వాస్తవాలు చెప్పారని అన్నారు. అర్ధరాత్రి దాటినా లక్షల్లో పోలింగ్ జరగడం ఎక్కడా లేదని ఆమె విమర్శించారు.
కూటమి కలిసి వచ్చినా :
పదిహేనేళ్ళ పాటు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెబుతున్న మాటలను ఆమె కొట్టివేశారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగినా అడ్డుకుంటామని ప్రజలు కూడా ఆ దిశగా చైతన్యవంతులు అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తధ్యమని ఆమె చెప్పడం విశేషం.
భారత రత్న ఇవ్వాలి :
ఇక ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని ఆమె కోరారు. ఆ విషయంలో కేంద్ర పెద్దలు సమ్మతిగా ఉన్నా తాను తీసుకుంటాను అన్న కారణంతోనే టీడీపీ పెద్దలు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడం లేదని లక్ష్మీపార్వతి అన్నారు. అయితే ఎన్టీఆర్ కి ఇచ్చే భారత రత్న అవార్డుని తాను తీసుకోనని కుటుంబ సభ్యులే తీసుకున్న తనకు అభ్యంతరం లేదని ఆమె చెప్పడం విశేషం. భారత రత్నకు ఎన్టీఆర్ అర్హుడని ఆమె స్పష్టం చేశారు.