తమ్ముళ్లు తెలుసుకోవాలి: కూటమికే బాబు ప్రాధాన్యం!
అక్కడితో వర్మ ప్రస్తావన పక్కకు జరిగింది. పవన్ కల్యాణ్ 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. కానీ, తర్వాత వర్మలో అసంతృప్తి సెగ రాజుకుంది.;
అలవి కాని చోట అధికుల మనరాదన్న-సూత్రం అందరికీ వర్తిస్తుంది. పరిస్థితులు మారినప్పుడు.. కిందపడ్డా పైచేయి అనే ధోరణి ఉంటే.. అది మరింతగా కుంగదీస్తుంది... ఈ మాటలు ఇప్పుడు పిఠాపురం వర్మగా పేరొందిన.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ ఎన్ వర్మకు అక్షరాలా వర్తిస్తాయని అంటున్నారు పరిశీలకులు.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం టికెట్‌ను ఆయన వదులుకోవాల్సి వచ్చింది. జనసేనతో పొత్తు నేపథ్యంలో టీడీపీ ఆయనకు టికెట్‌ను నిరాకరించింది. ఈవిషయంలో తొలి నాళ్లలో ఎదురు తిరిగే ప్రయత్నం చేసినా.. తర్వాత.. సీఎం చంద్రబాబు జోక్యంతో అప్పట్లో సర్దుబాటు ధోరణిని ప్రదర్శించారు. తర్వాత.. పవన్ వెళ్లి.. స్వయంగా వర్మను ఒప్పించారు. ఆయన మాతృమూర్తి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
అక్కడితో వర్మ ప్రస్తావన పక్కకు జరిగింది. పవన్ కల్యాణ్ 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. కానీ, తర్వాత వర్మలో అసంతృప్తి సెగ రాజుకుంది. తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తరచుగా పిఠాపురం వివాదాలకు కేంద్రంగా మారింది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితిలో నాయకులను పక్కన పెట్టయినా.. కూటమిని కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లోనే కాదు.. రాబోయే మూడు ఎన్నికల్లోనూ కూటమిని గెలిపించుకుని ఏపీని గాడిలో పెట్టాల న్న బృహత్ సంకల్పంతో కూటమి నాయకులు చంద్రబాబు, పవన్, బీజేపీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులుగా ఉన్నవారు సర్దుకు పోవాలే తప్ప.. పైచేయి కోసం ప్రయత్నం చేస్తే.. వారే నష్టపోతారంటూ.. అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కూడా దాదాపు అదే పని చేస్తున్నారు.
పిఠాపురంలో చోటు చేసుకున్న పరిణామాల్లో తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది? అని చంద్రబాబు చూడలేదు. కూటమిలో ఏర్పడిన వివాదాలను రోడ్డెక్కించడంపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి కలివిడికి ఇవన్నీ.. ఇబ్బందికరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ్ముళ్లు తెలుసుకోవాలంటూ.. చంద్రబాబు గట్టిగానే చెప్పారు.
అయినా.. ఇప్పటికీ తెలుసుకోకుండా.. పైచేయి కోసం.. ప్రయత్నం చేస్తే నాయకులనే పక్కన పెట్టే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. సో.. వర్మ అయినా.. మరొకరైనా.. ఇప్పుడు కూటమికే ప్రాధాన్యం ఇవ్వాలన్న చంద్రబాబు దూరదృష్టిని అర్ధం చేసుకోవాల్సిందే.