ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!

ఆసుపత్రి బిల్లులు పెరగడం వల్ల నేరుగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా ప్రతి ఏటా 15-20 శాతం పెరుగుతున్నాయి.;

Update: 2026-04-23 04:50 GMT

ఒక మధ్య తరగతి మనిషికి ప్రాణం మీద కంటే ఆసుపత్రి బిల్లు మీద ఎక్కువ భయం కలుగుతున్న నేటి రోజుల్లో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప ఊరటనే చెప్పాలి. ప్రాణం కాపాడుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి సామాన్యుడిని రక్షించడానికి ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు 'మెడికల్ మాఫియా'కు పగ్గాలు వేసే దిశగా కనిపిస్తోంది.

భారతదేశంలో వైద్యం అనేది ఒక సేవా రంగం నుంచి వ్యాపార రంగంగా మారిపోయింది. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులలో ఒక సామాన్యుడు చికిత్స పొందాలంటే, అది వారి జీవితకాల పొదుపు మొత్తాన్ని వెచ్చించాల్సిందే. ఈ క్రమంలో, ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేసే అడ్డగోలు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం చివరకు ఒక కఠినమైన ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురాబోతోంది. వైద్య పరికరాల ధరలపై లాభాల పరిమితిని విధించడం ద్వారా వైద్య ఖర్చులను భారీగా తగ్గించడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశ్యం.

ఏమిటీ ‘మెడికల్ మాఫియా’ వివాదం..?

చాలా సందర్భాల్లో ఆసుపత్రులు తమకు అతి తక్కువ ధరకే లభించే సిరంజిలు, గ్లౌజులు, కాన్యులాస్ వంటి వాటిపై కూడా వందల రెట్లు ఎక్కువ లాభాన్ని వేసి రోగికి బిల్లు వేస్తుంటాయి. పది రూపాయల వస్తువును వంద రూపాయలకు అమ్మడం, అలాగే పేస్‌ మేకర్లు, స్టెంట్లు వంటి ఖరీదైన పరికరాలపై భారీగా కమీషన్లు వసూలు చేయడం వల్ల బిల్లులు లక్షల్లోకి చేరుతున్నాయి. ఏ చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ముందే చెప్పకపోవడం, బిల్లింగ్‌లో అస్పష్టత ఉండటం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు సోషల్ మీడియాలో నిధుల కోసం వేడుకోవాల్సిన పరిస్థితులు చూస్తున్నాం.

ప్రభుత్వ ధరల నియంత్రణ ఇలా!

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పుడు బీమా సంస్థలు, ఇతర వాటాదారులతో కలిసి ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

మార్జిన్ల పరిమితి: వైద్య పరికరాల కొనుగోలు ధరపై ఆసుపత్రులు ఎంత శాతం వరకు లాభం వేసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ పరిమితికి మించి రూపాయి కూడా అదనంగా వసూలు చేసేందుకు వీల్లేదు. కేవలం స్టెంట్లు, కవాటాలే కాకుండా.. ప్రతి రోజూ వాడే కాటన్, చేతి తొడుగులు వంటి వాటిని కూడా ఈ నిబంధన పరిధిలోకి తీసుకువస్తారు.

యూనిఫాం ప్రైసింగ్: ఆసుపత్రి గుర్తింపు లేదంటే ప్రాంతంతో సంబంధం లేకుండా, ప్రాథమిక వైద్య పరికరాల ధరలు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

బీమా ప్రీమియంలపై సానుకూల ప్రభావం

ఆసుపత్రి బిల్లులు పెరగడం వల్ల నేరుగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా ప్రతి ఏటా 15-20 శాతం పెరుగుతున్నాయి. ఒకవేళ ఆసుపత్రి బిల్లులు నియంత్రణలోకి వస్తే, బీమా కంపెనీలకు క్లెయిమ్ ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల సామాన్యులు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా తగ్గే అవకాశం ఉంది లేదా కనీసం స్థిరంగా ఉంటాయి. బిల్లింగ్‌లో పారదర్శకత రావడం వల్ల బీమా కంపెనీలు, ఆసుపత్రుల మధ్య ఉండే వివాదాలు కూడా తగ్గుతాయి.

సవాళ్లు మరియు ఆచరణ

ఈ ఫ్రేమ్‌వర్క్‌ అమలు చేయడం అంత సులభమైనది కాదు. ప్రైవేట్ ఆసుపత్రులు తమ నిర్వహణ ఖర్చులు పెరిగాయని, నాణ్యమైన సేవలు అందించాలంటే ఖర్చు తప్పదని వాదించవచ్చు. అయితే, ప్రభుత్వం ‘లాభం ఉండాలి కానీ దోపిడీ ఉండకూడదు’ అనే సూత్రాన్ని బలంగా వినిపిస్తోంది.

ప్రభుత్వం గనుక ఈ కార్యాచరణను కఠినంగా అమలు చేస్తే, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇదొక చారిత్రాత్మక మార్పు అవుతుంది. వైద్యం కోసం అప్పులపాలయ్యే కుటుంబాల సంఖ్య తగ్గుతుంది. ఆసుపత్రికి వెళ్తే ప్రాణం దక్కుతుందనే ధీమాతో పాటు, ఆస్తి మిగులుతుందనే నమ్మకం కూడా సామాన్యుడికి కలగాలి. అప్పుడే ‘అందరికీ ఆరోగ్యం’ అనే లక్ష్యం నెరవేరుతుంది.

Tags:    

Similar News