కెనడాలో కుమార్తె దారుణ హ‌త్య‌.. ప్రియుడే గొంతు నులిమి..!

కేసు విచారణలో భాగంగా పోలీసులు ద‌మ‌న్ ప్రీత్ భాగస్వామి అయిన 22 ఏళ్ల రితిష్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా అనుమానించి జూలై 22న అదుపులోకి తీసుకున్నారు.

Update: 2026-07-26 05:35 GMT

కెనడాలో పంజాబ్‌కు చెందిన ఒక యువతి దారుణ హత్యకు గురికావడం స్థానిక భారతీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పంజాబ్‌లోని లుధియానా జిల్లా సమ్రాలా ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్.. కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో తన భాగస్వామితో కలిసి నివసిస్తోంది. అయితే ఇటీవల ఆమె తన స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురికావడంతో ఈ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ (ఈపీఎస్‌) అందించిన సమాచారం ప్రకారం... జూలై 9న సిల్వర్ బెర్రీ ప్రాంతంలోని ఒక ఇంట్లో యువతి స్పృహ తప్పి పడి ఉందనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రగాయాలతో ఉన్న దమన్ ప్రీత్ కౌర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించినా పరిస్థితి విషమించడంతో ఆమె జూలై 12న చికిత్స పొందుతూ మరణించింది. అనంతరం పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యాధికారులు ఇది కచ్చితంగా హత్యేనని ధృవీకరించారు.

కేసు విచారణలో భాగంగా పోలీసులు ద‌మ‌న్ ప్రీత్ భాగస్వామి అయిన 22 ఏళ్ల రితిష్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా అనుమానించి జూలై 22న అదుపులోకి తీసుకున్నారు. దమన్ ప్రీత్ కౌర్ గొంతు నులిమి హత్యకు గురైనట్లు శవపరీక్ష నివేదిక ఆధారంగా వెల్లడించారు. ఈ కేసును `ఇంటిమేట్ పార్టనర్ హోమిసైడ్` (సహజీవనంలో ఉండే భాగస్వామి చేసిన హత్య) గా వర్గీకరించిన పోలీసులు, అతడిపై సెకండ్-డిగ్రీ మర్డర్ అభియోగాలు మోపి అరెస్ట్ చేశారు.

ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడుతుందని భావించి దమన్ ప్రీత్ కౌర్‌ను ఐదేళ్ల క్రితం కుటుంబ సభ్యులు కెనడాకు పంపించారు. తీరా ఆమె ఇలా దారుణంగా హత్యకు గురవ్వడంతో పంజాబ్‌లోని స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే ఒక్క కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు.. కూతురి మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి కన్నీరుమున్నీరవుతున్నారు.

దమన్ ప్రీత్ కౌర్ భౌతికకాయాన్ని ఇండియాకు తరలించి.. చివరి క్రతువులు నిర్వహించడానికి అయ్యే ఖర్చుల కోసం విరాళాల సేకరణ ప్రారంభించారు. `గోఫండ్ మీ` ప్రచారం ద్వారా అంతర్జాతీయ రవాణా, ఇతర ఖర్చుల కోసం 20,000 డాల‌ర్ల‌ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే దాదాపు 19,000 డాలర్ల‌ వరకు విరాళాలు సమకూరాయి. ఈ విషాద ఘటన ప్రవాస భారతీయుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.

ఏడాది కాలంలోనే...

గత కొద్ది కాలంగా విదేశాలలో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లి హత్యలకు గురవుతున్న భారతీయ యువతీ యువకుల వరుస సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, అమెరికా వంటి దేశాల్లో భారతీయ విద్యార్థులు, యువ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న తుపాకీ కాల్పులు, వర్ణవివక్ష దాడులు.. సహజీవన సంబంధాల్లో పెరిగిన హింస కారణంగా పలువురు భారతీయులు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కెనడాలో దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్యతో పాటు అమెరికాలో పలువురు తెలుగు, భారతీయ విద్యార్థులపై జరిగిన ఘాతుకాలు నిదర్శనంగా నిలిచాయి. కన్నవారి కలలను నెరవేర్చేందుకు ఎంతో ఆశతో సరిహద్దులు దాటిన యువత ఇలా అర్ధాంతరంగా బలికావడం వారి కుటుంబాలకు కోలుకోలేని శోకాన్ని మిగులుస్తుండటంతో పాటు.. విదేశాల్లో ఉండే మన యువత భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Tags:    

Similar News