భర్తను 1లక్ష 'భరణం దోపిడీ పథకం' నుంచి కాపాడిన AI
ఈ విచారణలో జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండేల ధర్మాసనం కేవలం వర్తమాన సంపాదననే కాకుండా... మారుతున్న సాంకేతిక పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.
ఆధునిక కుటుంబ వ్యవస్థలోనూ.. న్యాయ సూత్రాలలోనూ వస్తున్న సమూల మార్పులకు అద్దం పడుతూ బాంబే హైకోర్టు ఒక విశిష్టమైన తీర్పును ఇచ్చింది. వైవాహిక బంధం ముగిసిన వేళ ఇచ్చే భరణం అనేది కేవలం చట్టబద్ధమైన ఆచారం కాదని... అది ఆర్థికంగా బలహీనంగా ఉన్న భాగస్వామికి మాత్రమే వర్తించే రక్షణ కవచమని ధర్మాసనం స్పష్టం చేసింది. భర్త కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న భార్యకు మధ్యంతర భరణం పొందే అర్హత లేదని తేల్చిచెప్పడం ద్వారా న్యాయస్థానం సమానత్వ సూత్రానికి ప్రాధాన్యమిచ్చింది.
ఈ కేసులోని వివరాలను పరిశీలిస్తే... న్యూజెర్సీలో ఐటీ ఉద్యోగం చేస్తూ నెలకు సుమారు రూ. 8 లక్షలు సంపాదిస్తున్న ఒక మహిళ... ఐటీ రంగంలోనే ఉంటూ తనకంటే తక్కువ ఆదాయం పొందుతున్న భర్త నుండి నెలకు రూ. 1 లక్ష భరణం కోరింది. విదేశాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉందనే కారణాన్ని చూపినా.. ఫ్యామిలీ కోర్టుతో పాటు బాంబే హైకోర్టు కూడా ఈ అభ్యర్థనను తోసిపుచ్చాయి. వ్యక్తిగత విదేశీ జీవన వ్యయాలను నెపంగా చూపి..భర్తపై అదనపు భారాన్ని మోపడం చట్టబద్ధంగా సరికాదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఈ విచారణలో జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండేల ధర్మాసనం కేవలం వర్తమాన సంపాదననే కాకుండా... మారుతున్న సాంకేతిక పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం పెరగడంతో ఉద్యోగ భద్రత తగ్గుతోందని... ఇలాంటి వేళ భర్త భవిష్యత్తు ఆదాయానికి ముప్పు ఉండవచ్చని పేర్కొంది. అలాగే ఇద్దరి సంతానంలో ఒకరి బాధ్యతను తండ్రి, మరొకరి బాధ్యతను తల్లి చూస్తున్న పరిస్థితుల్లో... ఆదాయంలో వెనుకబడిన భర్త నుండి భరణం ఆశించడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది.
గతంలో భరణం చట్టాలు ప్రధానంగా ఆర్థిక స్వాతంత్య్రం లేని, ఇంట్లో కుటుంబ బాధ్యతలకే పరిమితమైన మహిళలకు భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించినవి. అయితే నేటి ఆధునిక యుగంలో మహిళలు పురుషులతో సమానంగా... కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఆర్థికంగా స్థిరపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు కేవలం పాత చట్టాల ప్రకారం కాకుండా... ఇరుపక్షాల వాస్తవ ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా విశ్లేషిస్తూ తీర్పులు ఇవ్వడం మారుతున్న కాలానికి సానుకూల సంకేతంగా నిలుస్తోంది.
సమకాలీన సమాజంలో భరణం చట్టాలు సంపూర్ణంగా రూపాంతరం చెందాల్సిన అవసరాన్ని ఈ తీర్పు వేలెత్తి చూపుతోంది. భరణం అనేది కష్టాల్లో ఉన్న భాగస్వామికి ఇచ్చే ఆసరాగా మాత్రమే ఉండాలి తప్ప... అది ఒక అదనపు ఆదాయ మార్గంగా లేదా ఎదుటివారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే సాధనంగా మారకూడదు. ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించిన వ్యక్తులు ఎవరికి వారే స్వతంత్రంగా జీవించేలా... లింగ వివక్షకు తావులేకుండా `సమన్యాయం` అందించేలా చట్టాల అమలు సాగడం అత్యంత ఆవశ్యకం.