అక్కడ సీఎం.. మంత్రుల వేతనాల్లో కోత.. రేవంత్ సర్కారు ఏం చేస్తుందో?

ఆర్థిక క్రమశిక్షణ మిస్ కావటం.. ప్రజాకర్షక నిర్ణయాలు.. పథకాలు దేశంలోని పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తున్నాయి.;

Update: 2026-04-23 05:10 GMT

ఆర్థిక క్రమశిక్షణ మిస్ కావటం.. ప్రజాకర్షక నిర్ణయాలు.. పథకాలు దేశంలోని పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తున్నాయి. ముందువెనుకా చూసుకోకుండా చేపట్టే కార్యక్రమాలు... ఎడాపెడా చేసే అప్పులు సైతం పలు రాష్ట్రాల్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి గురయ్యేలా చేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఉంది.

తాజాగా అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దీని ప్రకారం ముఖ్యమంత్రి.. మంత్రులు.. ఎమ్మెల్యేల వేతనాల్లో తాత్కాలిక కోత అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. మఖ్యమంత్రి జీతంలో 50 శాతం.. ఉప ముఖ్యమంత్రి.. మంత్రులు.. స్పీకర్.. డిప్యూటీ స్పీకర్ వేతనాల్లో 30 శాతం చొప్పున.. ఎమ్మెల్యేల వేతనాల్లో 20 శాతం చొప్పున కోత వేసుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. ఈ నిర్ణయం కేవలం ఆర్నెల్లు ఉండేలా చేయనున్నారు. అప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే కోత విధించిన సొమ్మును తిరిగి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులకు కారణం కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు నిలిచిపోవటమేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు. తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి వేళ.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాదిరి.. ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తమ వేతనాల్లో కోత విధించుకోవటం.. వీలైనంతగా పొదుపు చర్యల్నిపాటించటం ద్వారా.. మంచి సంప్రదాయాన్ని స్టార్ట్ చేసినట్లు అవుతుంది. అదే సమయంలో ప్రభుత్వ అధికారులకు సైతం పొదుపు చర్యల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని తరచూ చెప్పాల్సిందే. అనవసరమైన ఖర్చులు తగ్గించటం.. దుబారాకు బ్రేక్ వేయటం.. అవినీతిని కట్టడి చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమించే వీలుంది. హిమాచల్ ప్రదేశ్ మోడల్ ను రెండు తెలుగు రాష్ట్రాలు ఫాలో అవుతాయా? అన్నది చూడాలి.

Tags:    

Similar News