శ్రీశైలం ఘోరానికి కారణం అదేనా?

Update: 2020-08-25 08:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి వరుస ఘోర ప్రమాదాల ఒరవడిని కొనసాగిస్తూ.. శ్రీశైలం పంప్ హౌస్‌ లో ఘోరం చోటు చేసుకుంది ఆరు రోజుల కిందట. పంప్‌హౌస్‌లో మంటలు చెలరేగి పది మంది విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద కారణాలపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన మరుసటి రోజు నుంచే అధికారులు విచారణ సాగిస్తున్నారు. దర్యాప్తు కీలక దశకు చేరుకుందని.. ప్రమాదానికి అసలు కారణమేంటో అధికారులు కనుగొన్నారని సమాచారం. 220 కేవీ డీసీ విద్యుత్‌ సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారట. అర్ధరాత్రి సమయంలో బ్యాటరీలను ఎందుకు బిగించాల్సి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే ఉన్నత అధికారులు, సీఈలు లేకుండా కింది స్థాయి సిబ్బంది బ్యాటరీలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నారు.

బ్యాటరీలు బిగించే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదని సంబంధిత సిబ్బందిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అత్యవసరంగా, అర్ధరాత్రి కొత్త బ్యాటరీలు మార్చాల్సి వచ్చిందంటే.. పాత బ్యాటరీలు పూర్తిగా పాడయ్యేవరకు ఎందుకు వేచి చూశారన్న కోణంలో అధికారులను సైతం సీఐడీ బృందం ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పించుకుని గాయాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి కూడా సీఐడీ బృందం వివరాలు సేకరిస్తోంది. మరోవైపు శ్రీశైలం పవర్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు విద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరించలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ కేంద్రం లోపలికి కూడా అధికారులు, సిబ్బంది పోలేక పోతున్నారు. టన్నెల్లో ఇంకా వేడి ఆవరించి ఉండటంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దర్యాప్తు విషయంలో కూడా ఇది ఆటంకంగా మారింది. టన్నెల్ యథాస్థితికి వచ్చాక ఇటు పంప్ హౌస్ అధికారులు, అటు సీఐడీ బృందం లోనికి వెళ్లి ప్రమాద కారణాలు, నష్టంపై పూర్తి అంచనాకు రానున్నారు.
Tags:    

Similar News