బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ.. రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయపడ్డారా?

ఇక 29న అసెంబ్లీ ప్రారంభానికి ముందే మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో రాజకీయ వేడి మామూలుగా ఉండదని భావించారు.;

Update: 2026-01-02 13:30 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత నెల 29న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఏసీ సమావేశంలో చర్చించిన ప్రకారం మూడు రోజుల విరామం తర్వాత శుక్రవారం సభ తిరిగి ప్రారంభమైంది. ఈ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. గత నెల 21న తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాను ‘‘రాజకీయంగా క్రియాశీలమవుతానని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతా, తోలు తీస్తా’’ అంటూ భీకర మీరు ప్రతిజ్ఞలు చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ సాగుతాయని అంతా భావించారు.

ఇక 29న అసెంబ్లీ ప్రారంభానికి ముందే మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో రాజకీయ వేడి మామూలుగా ఉండదని భావించారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ సభ ప్రారంభమైన వెంటనే అంటే నిమిషాల వ్యవధిలోనే బయటకు వెళ్లిపోయారు. ఇదే సమయంలో ఆయన మళ్లీ 2వ తేదీన వస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. దీనికి తగ్గట్టే సాగునీటి రంగ నిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నారని, అసెంబ్లీలో మాట్లాడేందుకు నోట్సు రెడీ చేసుకుంటున్నారని బీఆర్ఎస్ లీకులిచ్చింది. దీంతో అధికార కాంగ్రెస్ కూడా అందుకు తగ్గట్టు ప్రిపేర్ అయిందని అంటున్నారు. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై జరిగిన ఒప్పందాలు, అప్పట్లో అసెంబ్లీ లోపల బయట కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ మాట్లాడిన మాటల వీడియోలను కాంగ్రెస్ సేకరించి సిద్ధం చేసుకుందని అంటున్నారు. ఒకటి రెండు వీడియోలను శాంపిల్ గా సోషల్ మీడియాకు వదిలింది.

దీంతో శుక్రవారం సభలో సాగునీటిపై చర్చ జరిగితే మంచి డిబేట్ జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేసుకున్నారు. అయితే 29న సభకు వచ్చిన కేసీఆర్ తర్వాత నందినగర్ ఉన్న నివాసానికి వెళ్లిపోగా, గురువారం వరకు అక్కడే ఉండి గురువారం సాయంత్రం మళ్లీ ఎర్రవెల్లి ఫాం హౌసుకు వెళ్లిపోయారని చెబుతున్నారు. ఆయన మళ్లీ ఇప్పట్లో హైదరాబాద్ వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో సాగునీటిపై కేసీఆర్ మాట్లాడతారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతారని అంచనా వేసుకున్న కేడర్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఇదే సమయంలో కేసీఆర్ సభకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడం, ఆయన మళ్లీ ఎర్రవెల్లి వెళ్లిపోయారన్న సమాచారం ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంపై మరింత దాడి పెంచారు.

కేసీఆర్ సభకు రావాలని, ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలను అసెంబ్లీలో చర్చిస్తే ప్రభుత్వం తగిన సమాధానం ఇస్తుందని, ఆయనను గౌరవంగా చూసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో కేసీఆర్ సభకు వచ్చినా రాకపోయినా సాగునీటిపై చర్చ జరిగితే ప్రభుత్వం తమను అవమానించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ అంచనాకు వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం చెప్పాలనుకున్నది చెప్పి, తమకు మాట్లాడనీయకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని గ్రహించిందని అంటున్నారు. దీంతో వ్యూహాత్మకంగా ప్రభుత్వ దాడి నుంచి తప్పించుకోడానికి అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు. నిజానికి కేసీఆర్ సభకు వచ్చేందుకు విముఖత చూపడంతో ఈ విషయమై మాట్లాడటానికి బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు సంసిద్దత వ్యక్తం చేశారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాడి అసెంబ్లీ ప్రారంభానికి ముందే ఉధృతంగా ఉందని భావించి ఆయన కూడా వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా సాగునీటిపై చర్చ నుంచి తప్పించుకుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News