నారా భరత్ రెడ్డి.. కర్ణాటకలో గాలిపై కాంగ్రెస్ బాణం
కర్ణాటకలో రెండున్నరేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓ యువ ఎమ్మెల్యేను బలంగా ప్రోత్సహిస్తోంది.;
కర్ణాటకలో రెండున్నరేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓ యువ ఎమ్మెల్యేను బలంగా ప్రోత్సహిస్తోంది. ఆయనను ప్రత్యర్థి పార్టీలోని ఓ బలమైన నాయకుడికి దీటైన సమాధానంగా నిలపాలని చూస్తోంది. రాజకీయ నేపథ్యం ఉన్న చురుకైన ఆ యువ నాయకుడు సైతం అసెంబ్లీలో, బయట ప్రత్యర్థికి సవాల్ విసురుతూ రాజకీయాలను హీట్ ఎక్కిస్తున్నారు. తాజాగా జరిగిన బళ్లారి ఘర్షణలతో ఈ విభేదాలు కర్ణాటక దాటి దేశమంతటా తెలిశాయి. దీంతో ఏమిటీ బళ్లారి రాజకీయం? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నారా భరత్ రెడ్డి.. వయసు కేవలం 36 ఏళ్లు. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తండ్రి నారా సూర్యనారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే. అయితే, మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి సోదరుల ప్రభావం మొదలయ్యాక బళ్లారిలో వారు చెప్పిందే నడవసాగింది. బీజేపీని ఈ ప్రాంతంలో వారు చాలా బలంగా తయారుచేశారు. అయితే, కేసుల కారణంగా బీజేపీ గాలి సోదరులను దూరం పెట్టింది. గత ఎన్నికలకు ముందు గాలి జనార్దనరెడ్డి కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీని స్థాపించారు. తాను బళ్లారిలో పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో గంగావతి నియోజకవర్గానికి మారారు. అక్కడినుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బళ్లారి సిటీలో గాలి జనార్దనరెడ్డి తన భార్య గాలి లక్ష్మీఅరుణను పోటీకి దింపారు. అయితే, ఆమెను నారా భరత్ రెడ్డి ఓడించారు.
అసెంబ్లీలో ఫైర్..
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో చూస్తే గాలి జనార్దన్ రెడ్డి- నారా భరత్ రెడ్డి మధ్య వైరం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. 36 ఏళ్ల యువకుడైన భరత్ రెడ్డి దూకుడుగా గాలిపై విరుచుకుపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇదే తరహా వైరం క్షేత్ర స్థాయిలోనూ ఉందని గురువారం రాత్రి బళ్లారిలో జరిగిన ఘర్షణ బట్టి స్పష్టం అవుతోంది. అటు గాలి, ఇటు భరత్ రెడ్డి వర్గీయుల మధ్య వైరంతో బళ్లారిలో ఎన్నడూ చూడని రీతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
తెలుగువారి ప్రాబల్య బళ్లారి బరిలో...
కర్ణాటకలోని బళ్లారి తెలుగువారి ప్రాబల్యం ప్రాంతం. ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా తెలుగు కుటుంబాలు ముఖ్యంగా ఆంధ్రా నుంచి వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డాయి. రాయలసీమ వాసులకూ భౌగోళికంగా బళ్లారి చాలా దగ్గర. వారు ఈ మేరకు ఆ ప్రాంతంతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా గొడవలు పడుతున్న గాలి జనార్దనరెడ్డి తండ్రిది ఒకప్పుడు రాయలసీమనే. భరత్ రెడ్డి పేరు ప్రకారం చూస్తే తెలుగు మూలాలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కాగా, భరత్ రెడ్డి తండ్రి సూర్యనారాయణ రెడ్డితో గాలి సోదరుల వైరం 25 ఏళ్లకు పైగా సాగుతోంది. ఈ క్రమంలో మొదట భరత్ రెడ్డి కుటుంబం వెనుకబడినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, భరత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మళ్లీ పుంజుకుంది. అదే ఊపులో రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు గాలి జనార్దనరెడ్డి ఇంటి ముందు బ్యానర్లు కట్టేందుకు ప్రయత్నించడం ఘర్షణలకు దారితీసింది. పరిస్థితి చేయి దాటడంతో ఎస్పీ కలుగజేసుకుని కాల్పులకు ఆదేశించేంత వరకు వెళ్లింది. ఇందులో ఎమ్మెల్యే వర్గీయుడు చనిపోయాడు.
గంగావతి నుంచి హుటాహుటిన వచ్చిన గాలి
తన ఇంటివద్ద గురువారం ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొని రాత్రికి అది ఘర్షణగా మారడంతో గంగావతి నుంచి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి హుటాహుటిన బళ్లారికి వచ్చారు. అదే సమయంలో రాత్రి 9.30కు బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదంతా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.