కేసీఆర్ కాకపోతే ఖతం...బీఆర్ఎస్ మీద ఆడబిడ్డ జోస్యం
బీఆర్ఎస్ అన్నది ఒక పార్టీగా పాతికేళ్ళుగా ఉంది. ఆ పార్టీ ఎన్నో విజయాలు చూసింది. అపజయాలను కూడా మోసింది.;
బీఆర్ఎస్ అన్నది ఒక పార్టీగా పాతికేళ్ళుగా ఉంది. ఆ పార్టీ ఎన్నో విజయాలు చూసింది. అపజయాలను కూడా మోసింది. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా పుట్టింది. ఏకంగా పద్నాలుగేళ్ల పాటు తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసింది. చివరికి రాదు అనుకున్న తెలంగాణాను సాధించింది. అంతే కాదు ఒకటికి రెండు సార్లు అన్నట్లుగా తెలంగాణా ఆవిర్భవించాక రాజ్యం చేసింది. దాదాపుగా పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. మరెంతో మంది సీనియర్లు ఉన్నారు. లక్షలాది మంది క్యాడర్ ఉంది. ఆ పార్టీకి కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరూ పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మరి ఇంతలా ఉన్న బీఆర్ఎస్ కి ఈ రోజుకీ కేసీఆర్ మాత్రమే దిక్కా. ఆయన అసెంబ్లీకి రాకపోయినా ఆయన నేరుగా సారధ్యం వహించకపోయిన బీఆర్ఎస్ పని ఖతం అవుతుందా. ఇది ఎవరో చెప్పిన జోస్యం కాదు, కేసీఆర్ ఇంటి ఆడబిడ్డ, బీఆర్ఎస్ లో అడుగులో అడుగు వేసి తన రాజకీయాన్ని పండించుకున్న కల్వకుంట కవిత అన్న మాటలు ఇవి. గులాబీ పార్టీ భవిష్యత్తు గురించి ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి.
కేసీఆర్ మాత్రమేనట :
బీఆర్ఎస్ అంటే కేసీఆర్ మాత్రమే అని కవిత స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే అని ఆమె చెబుతున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సారథ్యాన్ని ట్రబుల్ బబుల్ షొటర్లకు అప్పగిస్తే ఇంతే సంగతులు అని కూడా ఆమె హెచ్చరించారు. ప్యాకేజీలు తీసుకునే వారు ఉన్నారంటూ కూడా ఆమె బీఆర్ ఎస్ ని అలెర్ట్ చేశారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తేనే గులాబీ పార్టీ అస్థిత్వం నిలబడుతుందని కవిత తనదైన శైలిలో చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె ట్రబుల్ షూటర్ అన్నది పరోక్షంగా హరీష్ రావు గురించే అని అంటున్నారు. అలాగే తన అన్న కేటీఆర్ నాయకత్వం మీద కూడా ఆమెకు నమ్మకం లేదా అన్న చర్చ కూడా నడుస్తోంది.
టార్గెట్ గట్టిగానే :
ఇదిలా ఉంటే కవిత హరీష్ రావుని గట్టిగానే టార్గెట్ చేశారు అని అంటున్నారు. ఆమె ఈ మధ్యనే హరీష్ రావుకు తెలంగాణా చంద్రబాబు అని కొత్త పేరు పెట్టారు. ఆయన వల్ల బీఆర్ఎస్ కి ఏమీ కాదన్నట్లుగా కవిత చెబుతున్నారు. ఇక ఈ మధ్యనే జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్ విజయం సాధించి పెట్టడంలో విఫలం అయ్యారు. దాంతో అన్న నాయకత్వం మీద కూడా జన విశ్వాసం లేదన్నట్లుగానే కవిత మాట్లాడుతున్నారని అంటున్నారు.
జాగృతి ఆల్టర్నేషన్ :
బీఆర్ఎస్ కి జాగృతి మాత్రమే ఆల్టర్నేషన్ అని కవిత గట్టిగా చెబుతున్నారు. అంటే కేసీఆర్ తరువాత ఆ స్థాయిలో తెలంగాణా ప్రజలకు తెలంగాణా సెంటిమెంట్ కి అస్థిత్వానికి నాయకత్వం వహించడం భరోసా ఇవ్వడం తన వల్లనే అవుతుందని కవిత బలంగా భావిస్తున్నారు అని అంటున్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ స్థాయి నేతలు ఎవరూ లేరని కూడా ఆమె అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో తన తండ్రి మీద ఈగ వాలనీయడం లేదు, ఆయనను ఉరి తీయాలన్న రేవంత్ రెడ్డి విమర్శలకు ఘాటుగా బదులు ఇచ్చిన కవిత ఇలా అయితే రేవంత్ ని రెండు సార్లు ఉరి తీయాలని చెప్పడం ద్వారా కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని బలంగా చాటుకున్నారు. ఒక విధంగా చూస్తే కేసీఆర్ రాజకీయ వారసురాలిని తానే అని ఆమె చెప్పదలచుకున్నారని అంటున్నారు. అందుకే ఆమె బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ హరీష్ రావు ఎవరు అయినా కూడా గులాబీ పార్టీకి పెద్దగా లాభం లేదని అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ మీద కొత్త ఏడాది వస్తూనే కవిత చెప్పిన ఈ సంచలన జోస్యం అయితే రాజకీయంగా చర్చనీయాంశంగానే ఉంది. చూడాలి మరి దీని పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది, అదే విధంగా తెలంగాణా రాజకీయాలలో గులాబీ పార్టీ దూకుడు ం ఏ విధంగా సాగుతుందో కూడా చూడాల్సి ఉంది.