సోషల్ మీడియా సెగ: అమెరికా ఎఫ్-1 వీసాకు ‘బ్రేక్’.. 221(జీ) ఉచ్చులో భారత విద్యార్థి!

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం ఒక విద్యార్థి పాలిట శాపంగా మారింది.;

Update: 2026-01-02 14:25 GMT

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం ఒక విద్యార్థి పాలిట శాపంగా మారింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి.. వీసా రీన్యూవల్ కోసం వచ్చి ప్రస్తుతం అనిశ్చితిలో చిక్కుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో అతడికున్న భారీ ఫాలోయింగ్ కారణంగా అమెరికా కాన్సులేట్ అధికారులు 221 (జీ) అడ్మినిస్ట్రేటివ్ హోల్డ్ విధించడం కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది.?

సదురు విద్యార్థి అమెరికాలో ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్నాడు. చదువుల మధ్యలో విరామం దొరకడంతో స్వదేశానికి వచ్చిన అతడు.. తన వీసా పొడిగింపు కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీసా పొందినప్పటికీ.. ఈసారి మాత్రం అధికారుల నుంచి అనూహ్య స్పందన ఎదురైంది. ఇంటర్వ్యూ ముగిశాక అతడికి ‘ఎల్లోస్లిప్’ అందజేస్తూ.. సోషల్ మీడియా రివ్యూ కోసం వీసాను హోల్డ్ లో పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

వైరల్ పోస్టులే కారణమా?

ఈ విద్యార్థికి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. గతంలో అతడు చేసిన కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన విద్యార్థి "నేను ఎప్పుడూ వివాదాస్పదమైన లేదా రాజకీయ సంబంధిత పోస్టులు చేయలేదు. కేవలం యాక్టివ్‌గా ఉండటం, ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటమే నాపై అదనపు తనిఖీలకు కారణమై ఉండొచ్చు" అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

221(జీ) అంటే ఏమిటి? ఎందుకీ ఆందోళన?

అమెరికా వీసా దరఖాస్తుదారుడి బ్యాక్‌గ్రౌండ్ చెక్ లేదా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం అదనపు సమయం కావాల్సి వచ్చినప్పుడు ఈ 221(జీ) సెక్షన్‌ను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు లేదా నెలల సమయం కూడా తీసుకోవచ్చు. సదరు విద్యార్థికి 10 రోజుల్లో అమెరికా వెళ్లడానికి ఫ్లైట్ ఉంది. కానీ పాస్‌పోర్ట్ అధికారుల వద్దే ఉండటం.. వీసా ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో ప్రయాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

నిపుణుల హెచ్చరిక

ఈ ఉదంతంపై వీసా నిపుణులు స్పందిస్తూ.. విద్యార్థులు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.వివాదాస్పద రాజకీయ, మతపరమైన పోస్టులకు దూరంగా ఉండాలంటున్నారు. అమెరికా చట్టాలకు వ్యతిరేకమైన అంశాలను ప్రమోట్ చేయకూడదని చెబుతున్నారు. వీసా రీన్యూవల్ సమయంలో తగినంత సమయం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ విద్యార్థి తన వీసా క్లియర్ అయ్యి, తిరిగి చదువుల కోసం అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు.

Tags:    

Similar News