ఏపీకి వచ్చి మరీ ఫైట్ చేయబోతున్న సోనియా రాహుల్

కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ వదిలి ఏపీ గల్లిలోకి వస్తున్నారు. దేశవ్యాప్తంగా స్ఫూర్తినింపేలా ఓ పెద్ద ఉద్యమం చేసేందుకు రెడీ అవుతున్నారు.;

Update: 2026-01-02 12:55 GMT

కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ వదిలి ఏపీ గల్లిలోకి వస్తున్నారు. దేశవ్యాప్తంగా స్ఫూర్తినింపేలా ఓ పెద్ద ఉద్యమం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేవ్ రాజకీయ యవనికపై ఈ కీలక ఘట్టానికి తెరలేపబోతున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో తన ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏకంగా జాతీయ అగ్రనేతలను రంగంలోకి దించుతోంది. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం పావులు కదుపుతోంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పును అస్త్రంగా చేసుకొని.. దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించేలా ఏపీ వేదికగా భారీ పోరాటానికి సిద్ధమైంది.

కేంద్రప్రభుత్వం తాజాగా ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ పేరును మార్చాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో భారీ ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది.

సెంటిమెంట్ వేదికగా బండ్లపల్లి నుంచే..

ఈ పోరాటం కోసం కాంగ్రెస్ ఎంచుకున్న వేదిక వెనుక ఒక బలమైన చరిత్ర ఉంది. 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కలిసి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత అదే ఫిబ్రవరి 2న అదే గ్రామంలో నిరసన గళం విప్పడం ద్వారా ఈ పథకం తమ మానసపుత్రిక అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.

తరలిరానున్న అగ్రనేతలు..

ఈ నిరసన కార్యక్రమం సాధారణ స్థాయిలో కాకుండా జాతీయ స్థాయి ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని కోసం కాంగ్రెస్ అగ్రనేతలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సోనియా గాంధీ ఈ పథకాన్ని ప్రారంభించిన నేతగా మళ్లీ అదే చోటుకు రానుండటం విశేషం గా చెప్పొచ్చు. రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే , ప్రియాంక గాంధీలు ఈ ఆందోళనల్లో పాలుపంచుకోనున్నారు.

రాజకీయ వ్యూహం ఏంటి?

కేవలం పేరు మార్పుపై నిరసన మాత్రమే కాదు.. దీనివెనుక లోతైన రాజకీయ వ్యూహం కూడా కనిపిస్తోంది. గాంధీ నెహ్రూ కుటుంబ ప్రవేశ పెట్టిన పథకాల ఉనికిని కాపాడుకోవడం.. ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మందికి జీవనాధారం. ఈ అంశంపై పోరాడటం ద్వారా పేదలకు దగ్గరవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏపీలో పునర్జీవం చెందేందుకు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చతికిలపడిన పార్టీని.. షర్మిల నాయకత్వంలో మల్లీ పట్టాలెక్కించే ప్రయత్నంలో భాగంగా ఈ పర్యటన దోహదపడనుంది.

ఫిబ్రవరి 2న బండ్లపల్లి వేదికగా జరిగే ఈ నిరసన కేవలం ఏపీ రాజకీయాలనే కాకుండా జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. 'చేయి' విడిచిన ఓటర్లను మళ్ళీ ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ఈ సాహసోపేత ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News