న్యూ ఇయర్ లో వంశీకి గుడ్ న్యూస్.. మాచవరం పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఒక విధంగా చెప్పాలంటే కొత్త ఏడాది ఆయనకు తీపి కబురే అందించిందని అంటున్నారు.;
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఒక విధంగా చెప్పాలంటే కొత్త ఏడాది ఆయనకు తీపి కబురే అందించిందని అంటున్నారు. విజయవాడలోని మాచవరం పోలీసుస్టేషనులో వంశీపై నమోదైన హత్యాయత్నం కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మాజీ ఎమ్మెల్యే అరెస్టు ముప్పు నుంచి తప్పించుకున్నారు. ఈ కేసులో వంశీతోపాటు 8 మంది అనుచరులపై మాచవరం పోలీసులు గత నెల 17న కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడంతో వంశీ అరెస్టు అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
విజయవాడ నగరానికి చెందిన సునీల్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు తనపై దాడి చేశారని, చంపుతామని బెదిరించారని కేసు పెట్టాడు. దీంతో వంశీ 2.0కి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత నెల 17న కేసు నమోదు అయిన వెంటనే వంశీ స్థానిక కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేయడంతో ఆయన హైకోర్టులో అప్పీలు చేశారు. కేసు విచారణకు రాకపోవడం, విచారణకు రమ్మంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అదేసమయంలో గత నెల 29న విజయవాడ కోర్టులో కిడ్నాప్ కేసు విచారణకు వంశీ గైర్హాజరయ్యారు అయినట్లు కథనాలు వచ్చాయి.
దీంతో వంశీ అరెస్టుపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయనను మళ్లీ అరెస్టు చేయించేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుందనే ప్రచారంతో వైసీపీ శ్రేణులు, వంశీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు స్థానిక కోర్టు ముందస్తు బెయిలు నిరాకరించడం వారి ఆందోళనను మరింత పెంచిందని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో వంశీతోపాటు ఆయన అనుచరులు గోవాకు వెళ్లిపోయారని, ఒక షిప్ లో దాక్కున్నారని, వారిని అరెస్టు చేసేందుకు విజయవాడ పోలీసులు కూడా వెళ్లారంటూ ప్రభుత్వ అనుకూల మీడియా హోరెత్తించింది.
ఇలా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేంద్రంగా గత ఐదు రోజులుగా పెద్ద చర్చే జరగడం రాజకీయంగా ఆసక్తి రేపింది. ఇప్పటికే 11 కేసులను ఎదుర్కొంటున్న వంశీ, సుమారు 140 రోజులు జైలు జీవితం గడిపి వచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు అయిన వంశీ జైలులో ఉండగా, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం కుదరుకోలేదని చెబుతున్నారు. గతంలో నిండుగా కనిపించిన వంశీ జైలుకు వెళ్లిన తర్వాత బక్కచిక్కిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి అరెస్టు అవుతారనే ప్రచారం సహజంగానే వైసీపీలో భయాందోళనను పెంచిందని అంటున్నారు. దీంతో హైకోర్టు ఇచ్చిన రక్షణతో వంశీతోపాటు ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు అరెస్టు చేయొద్దన్న హైకోర్టు సూచనలపై వైసీపీ ఆనందం వ్యక్తం చేస్తోంది.