రీ-మైగ్రేషన్.. లక్షలాది మంది వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఒక హెచ్చరిక

రీ-మైగ్రేషన్ అనేది ఒక అధికారిక పాలసీలా కనిపిస్తున్నా.. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ‘ఎథ్నిక్ క్లీన్సింగ్’ కు దగ్గరగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.;

Update: 2026-01-02 12:30 GMT

ప్రపంచీకరణ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మెరుగైన చదువు, ఉద్యోగ అవకాశాలు, భద్రత కోసం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం అనేది దశాబ్దాలుగా సాగుతున్న ప్రక్రియ. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘రీ–మైగ్రేషన్’ అనే కొత్త పదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం పదం మాత్రమే కాదు.. లక్షలాది మంది వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఒక హెచ్చరిక.

ఏమిటీ రీ-మైగ్రేషన్

సాధారణంగా ఒక వ్యక్తి తన సొంత ఇష్టంతో స్వదేశానికి తిరిగి రావడాన్ని మనం రీ-మైగ్రేషన్ అనుకుంటాం.. కానీ ప్రస్తుతం ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో వినిపిస్తున్న ఈ పదం అర్థం వేరు. చట్టబద్దంగా ఆ దేశంలో నివసిస్తున్నప్పటికీ పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కేవలం జాతి, మతం లేదా వారి మూలాల ఆధారంగా బలవంతంగా వెనక్కి పంపించే ప్రక్రియను ఇప్పుడు రాజకీయ వర్గాలు ‘రీ-మైగ్రేషన్’ అని పిలుస్తున్నాయి.

స్వచ్ఛందంగా కాదు.. ఇది బలవంతపు బహిష్కరణ..

రీ-మైగ్రేషన్ అనేది ఒక అధికారిక పాలసీలా కనిపిస్తున్నా.. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ‘ఎథ్నిక్ క్లీన్సింగ్’ కు దగ్గరగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మీరు ఆ దేశంలో చట్టబద్దంగా ఉన్నారా అనేది ఇక్కడ ముఖ్యం కాదు... మీరు ఆ దేశ సంస్కృతిలో కలిసిపోయారా? అన్నది కూడా అనవసరం.. మీరు ఇక్కడి వారు కాదు అని ఒక వర్గం భావిస్తే చాలు.. మిమ్మల్ని వెనక్కి పంపేలా చట్టాలను రూపొందించడం ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.

ప్రపంచవ్యాప్త ఆందోళన.. హక్కుల సంఘాల హెచ్చరిక

ఈ ధోరణిపై ఐక్యరాజ్యసమితి (యూఎన్), అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. "వలసల నియంత్రణ పేరుతో జాతి వివక్షను చట్టబద్ధం చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు" అని వారు హెచ్చరిస్తున్నారు.

ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది?

దేశంలోని నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, నేరాలకు వలసవాదులే కారణమని కొందరు రాజకీయ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వలసవాదుల వల్ల తమ దేశ మూల సంస్కృతిని దెబ్బతింటుందనే భయాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారు. స్థానిక ప్రజల ఓట్లను ఆకర్షించడానికి 'రీ-మైగ్రేషన్'ను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు.

ప్రమాదంలో మానవ హక్కులు..

రీమైగ్రేషన్ విధానం అమలులోకి వస్తే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దశాబ్దాలుగా ఒకదేశంలో ఉండి అక్కడ ఆస్తులు కూడబెట్టుకొని పిల్లలను చదివించుకుంటున్న వారి భవిష్యత్తు ఒక్కసారిగా అంధకారమవుతుంది. సమాజంలో మైనార్టీలు, వలసదారులపై దాడులు పెరిగే అవకాశం ఉంది. చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం ఇక్కడ తుంగలో తొక్కబడుతుంది.

మానవత్వమే ముఖ్యం..

సరిహద్దులు దేశాలను వేరు చేయవచ్చు. కానీ మానవత్వం అందరినీ కలపాలి. మైగ్రేషన్ అనేది ఒక అవసరం. కానీ రీ-మైగ్రేషన్ పేరుతో జరుగుతున్న ఈ బలవంతపు బహిస్కరణ చట్టబద్దమైన వివక్షగా మారకూడదు. ప్రపంచ దేశాలు ఈ విషయంలో మానవీయ కోణంలో ఆలోంచిచాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.

Tags:    

Similar News