కలెక్టర్ ను చెప్పులు ఎంత పని చేశాయంటే..

Update: 2016-07-26 04:38 GMT

వ్యవహారశైలి సరిగా లేకుంటే.. ఎంత మంచిపని చేసినా ప్రయోజనం ఉండదు. కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యల్ని తీర్చేందుకు ఒక మహిళా కలెక్టరమ్మ చేసిన కృషిని అంతా అభినందిస్తున్న వేళ.. సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పనిలో సదరు కలెక్టరమ్మను వంక పెట్టలేకున్నా.. ఆమె వ్యవహారశైలి వేలెత్తి చూపేలా మారింది. ప్రశంసల వేళ విమర్శలతో ఇరుకున పడాల్సి వచ్చింది.

గడిచిన కొద్దిరోజులుగా ఛత్తీస్ గఢ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. దీంతో.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకునేందుకు.. వారికి సహాయ సహకారాలు అందించేందుకు కలెక్టర్ షమ్మీ రంగంలోకి దిగారు. తాను వెళ్లాల్సిన ప్రాంతానికి మధ్యలో నదిని దాటాల్సి రావటం.. అదంతా బురదగా ఉన్న వేళ.. ఆమె ధైర్యంగా నదిని దాటి వెళ్లటంతో ఆమెను అభినందించారు. ఆమె ప్రదర్శించిన ధైర్యానికి అందరూ ప్రశంసించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. నది దాటే సమయంలో తాను వేసుకున్నచెప్పుల్ని సిబ్బంది చేత మోయించిన ఫోటో బయటకు వచ్చింది. అది కాస్తా వైరల్ కావటంతో అప్పటివరకూ కలెక్టర్మను పొగిడినోళ్లే ఆమె అహంకారాన్ని తప్పు పట్టటం మొదలు పెట్టారు. సీన్ ఒక్కసారి మారిపోవటంతో కలెక్టర్ నష్టనివారణ చర్యలు షురూ చేశారు. తన చెప్పుల్ని వాహనంలోనే విడిచిపెట్టానని.. సిబ్బంది తీసుకురావటం తనకు తెలీదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఫోటో చూస్తే.. ఆమెకు నాలుగు అడుగుల దూరంలోనే ఉన్న సిబ్బంది చేతుల్లో చెప్పులు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇది చూస్తే చాలు కలెక్టరమ్మ మాటల్లో నిజం ఎంతో తెలవటానికి. ఈ కవరింగ్ వ్యవహారమే కలెక్టరమ్మ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది.
Tags:    

Similar News