ఏటిగడ్డలో అంత రచ్చ జరిగిందా..?

Update: 2016-06-19 04:31 GMT
మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయే వారి వ్యవహారం వివాదాస్పదంగా మారటమే కాదు.. ఈ వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. తాజాగా మెదక్ జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్ లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు పెద్దగా ఫోకస్ కాలేదనే చెప్పాలి.అక్కడి నిరసనలు.. ఆందోళనలకు సంబంధించిన మీడియా కవరేజ్ బాగా తక్కువనే చెప్పాలి. ఈ కారణంతోనే ఇక్కడి తీవ్రత బయటకు పెద్దగా కనిపించని పరిస్థితి.

మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం గ్రామస్థులతో బలవంతంగా భూములు రిజిష్ట్రేషన్లు చేయిస్తున్నారంటూ రైతులు తీవ్రఆందోళన చేస్తున్నారు. మొన్నటి వరకూ నిరసన ప్రదర్శనలు జరపగా.. శనివారం అందుకు భిన్నంగా ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆరోపణలు చేస్తూ.. ఏటిగడ్డ కిష్టాపూర్ ఎంపీటీసీ సభ్యుడు దామరంచ ప్రతాప్ రెడ్డికి చెందిన పంటల్ని ధ్వంసం చేయటంతో పాటు.. మరికొందరి పంటలపైనా గ్రామస్థులు దాడి చేయటం గమనార్హం.

అంతేకాదు.. ఎంపీటీసీ వ్యవసాయ బావి దగ్గరున్న స్పింక్లర్లకు నిప్పు పెట్టారు కూడా. ఆయనకు చెందిన పంటలతో పాటు.. ఆయన బంధువుల పంటల్ని ధ్వంసం చేయటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన తమ బలగాలతో వచ్చి.. పంటల్ని ధ్వంసం చేస్తున్న మహిళల్ని పోలాల నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులకు.. పోలీసులకు మధ్యతీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకదశలో పోలీసుల్ని నెట్టివేసి మరీ.. పంటల్ని ధ్వంసం చేశారు. దీంతో..  పోలీసులు లాఠీ ఛార్జ్ చేయగా.. కొందరు మహిళలు సొమ్మసొల్లి పడిపోయినట్లుగా చెబుతున్నారు. పంటలపై దాడి చేసిన ఉదంతంలో 62 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసిన ఈ ఉదంతంపై విచారణ జరిపిస్తున్నారు. అసాధ్యమైన తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన కేసీఆర్.. తానే ప్రభుత్వ పెద్దగా ఉన్న నేపథ్యంలో.. ప్రాజెక్టుల కారణంగా భూములు పోయే వారికినష్టం కలగకుండా.. వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకోకుండా.. వారి మనసుల్ని నొప్పించకుండా ఇష్యూను సెటిల్ చేయలేరా? ఆయన తలుచుకుంటే.. ఇదో విషయమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విషయంలో కేసీఆర్ సర్కారు పట్టనట్లు ఎందుకు ఉంటున్నట్లు..?
Tags:    

Similar News