లోక్‌ సభలో అదరగొట్టిన బాలకృష్ణ హీరోయిన్

Update: 2019-11-18 13:17 GMT
పార్లమెంటు సమావేశాల తొలి రోజున అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అందులో మహారాష్ట్ర రైతుల సమస్య కూడా ఒకటి. మహారాష్ట్రలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా గళం విప్పారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో బాలకృష్ణ వంటి అగ్రహీరోలతోనూ నటించిన నవనీత్ కౌర్ అనంతరం యాక్టర్ నుంచి పొలిటీషియన్‌ గా మారి ఇప్పుడు లోక్ సభలో అదరగొట్టారు.

నవనీత్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడానికి కారణం శివసేననే అంటూ ఆమె ఫైరయ్యారు. ఆమె ప్రసంగానికి శివసేన సభ్యులు అడ్డుతగిలినా కూడా ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మహారాష్ట్రలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వం లేకపోవడమే కారణమని.. ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడానికి శివసేనే కారణమని ఆరోపించారు.

ప్రజలు శివసేనకు ఎక్కువ అసెంబ్లీ సీట్లిచ్చినా వారు స్వార్థ రాజకీయాలతో మహారాష్ట్రలో గవర్నెన్సు లేకుండా చేసి రైతులను సమస్యల్లోనే కొట్టుమిట్టాడేలా చేస్తున్నారన్నారు. ‘‘మహారాష్ట్ర నుంచి ఎన్నికైన ఎంపీగా రైతుల సమస్యను మాట్లాడుతాను. నా ప్రసంగాన్ని ఎవరు అడ్డుకోలేరు. రైతుల గురించి మీ అభిప్రాయాన్ని చెప్పారు. దానికి నేను అడ్డుపడలేదు. నా అభిప్రాయాన్ని వెల్లడించకుండా అడ్డుకోవడం సరికాదు. శివసేనకు రైతుల పట్ల ప్రేమ లేదు’’ అని నవనీత్ రాణా పేర్కొన్నారు. ఒకవేళ మహారాష్ట్రలో రైతుల సమస్యలను పరిష్కరించే విషయంలో చిత్తశుద్ది ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు. కానీ వారు తమ స్వార్ధం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుపుల్ల వేశారు. అంతేకాకుండా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు ప్రధాన కారణమయ్యారు. ఇక మహారాష్ట్రలో పేరుకుపోయిన కరువు - క్షామానికి పరోక్షంగా మరోసారి కారణమవుతున్నారు అని నవనీత్ కౌర్ విరుచుకుపడ్డారు.

మహారాష్ట్రలోని కరువు జిల్లాల్లో తాను విస్తృతంగా పర్యటించానని.. అక్కడి రైతుల కష్టాలు తనకు తెలుసని ఆమె చెప్పారు.  అకాల వర్షాల వల్ల సోయాబిన్ - కందులు - ఇతర ధాన్యాల పంటలకు సంబంధించి విపరీతమైన నష్టం వాటిల్లింది. ఈ విషయంలో మహారాష్ట్రలో ప్రధాన పార్టీలకు ఎలాంటి పట్టింపు లేదు అని నవనీత్ కౌర్ ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీల తీరు నచ్చకపోవడం వల్లనే - రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువస్తున్నాను. మహారాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యత కేంద్రానికి ఉందని భావించినందునే ఈ విషయాన్ని సభలో ప్రస్తావిస్తున్నాను. మహారాష్ట్ర రైతుల కన్నీటిని తుడవడానికి కేంద్ర రూ.50 వేల కోట్లు తక్షణ అవసరం ఉంది. కాబట్టి వాటిని వెంటనే విడుదల చేసి రైతులను బాధలను దూరం చేయాలని కోరారు.

నవనీత్ కౌర్ తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మీ - జగపతి - మహారథి - యమదొంగ - జాబిలమ్మ - లవ్ ఇన్ సింగపూర్ - కాలచక్రం వంటి సినిమాల్లో నటించారు. హిందీ - తమిళ - కన్నడ - పంజాబీ - మలయాళ సినిమాల్లోనూ నటించారు. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన రవి రాణాను వివాహం చేసుకొని నవనీత్ రాణాగా మారారు. ప్రస్తుత లోక్‌ సభలో ఎంపీగా కొనసాగుతున్నారు.
Tags:    

Similar News