ఏర్పేడు దారుణంలో స‌రికొత్త కోణం

Update: 2017-04-23 06:42 GMT
ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు. ఏకంగా ప‌దిహేను మంది.. ఒక రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టం అంటే.. అంత‌కు మించిన దారుణం మ‌రొక‌టి ఉండ‌దు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నానికి కార‌ణ‌మైన ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రి నిర్ల‌క్ష్యం.. బ‌రితెగింపు ఇంత‌టి మ‌హా విషాదానికి కార‌ణం కావ‌టం గ‌మ‌నార్హం.

ఏదో పొర‌పాటున జ‌రిగిన‌ట్లుగా ప్ర‌మాదాన్ని చిత్రీక‌రిస్తున్నా.. అదంతా నిజం కాద‌ని.. మాన‌వ త‌ప్పిద‌మే ఇంత మంది ప్రాణాలు పోయేలా చేసింద‌న్న‌విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. నిర్ల‌క్ష్యంగా లారీ న‌డిపిన వైనంలో 17 మంది ప్రాణాలు గాల్లోకి క‌లిసిపోయాయి. ఈ ప్ర‌మాదానికి కార‌ణం లారీ డ్రైవ‌ర్ అని పోలీసులు చెబుతున్నా.. అది నిజం కాద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన సీసీ కెమేరా ఫుటేజ్ స్ప‌ష్టం చేస్తోంది.

ఈ ఘోర ప్ర‌మాదానికి లారీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం.. డ్రైవింగ్‌ కు ఏ మాత్రం సంబంధం లేని క్లీన‌ర్ లారీ న‌డిపిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఘోర ప్ర‌మాదానికి సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో భారీ లారీని న‌డిపింది.. డ్రైవ‌ర్ కాద‌ని.. లారీ క్లీన‌ర్ అన్న విష‌యం స్ప‌ష్టంగా తెలిసేలా సీసీ కెమేరా ఫుటేజ్ ల‌భించ‌టం గ‌మ‌నార్హం.  

అయితే.. ఈ ప్ర‌మాదానికి కార‌ణం లారీ డ్రైవ‌ర్ గా పోలీసులు చెబుతుండ‌గా.. ఈ వాద‌న‌కు పూర్తి భిన్నంగా క్లీన‌రే.. ఇన్ని ప్రాణాలు కోల్పోవ‌టానికి కార‌ణ‌మైన‌ కీల‌క ఆధారం ల‌భించ‌టం విశేషం. ఇసుక అక్ర‌మ దందాను ఆపేయాల‌ని డిమాండ్ చేస్తూ.. శుక్ర‌వారం ఏర్పేడు పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తున్న గ్రామ‌స్తుల‌పై లారీ అదుపు త‌ప్పి దూసుకెళ్లి.. విద్యుత్ స్తంభాన్ని  ఢీ కొట్టిన దుర్ఘ‌ట‌న‌లో మొత్తం 17 మంది (15 మంది ఘ‌ట‌నాస్థ‌లంలోనే.. మ‌రో ఇద్దరు ఆసుప‌త్రిలో) మ‌ర‌ణించ‌టం తెలిసిందే. లారీ న‌డిపే స‌మ‌యంలో డ్రైవ‌ర్ మ‌ద్యం సేవించి ఉన్న‌ట్లుగా చెప్పారు. ఇలాంటిది ఇప్పుడు అందుకు భిన్నంగా క్లీన‌రే వాహ‌నం న‌డిపిన‌ట్లుగా సీసీ ఫుటేజ్ చెప్ప‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. మ‌రిప్ప‌టివ‌ర‌కూ డ్రైవ‌రే ప్ర‌మాదానికి కార‌ణంగా చెబుతున్న పోలీసులు.. సీసీ పుటేజ్ విష‌యంపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News