ఫేస్ బుక్ ఆగమాగం కావటం వెనుక అతడేనా కారణం?

Update: 2021-10-05 06:38 GMT
నిర్విరామంగా ఎన్ని సంవత్సరాలు సేవలు అందించినా అదో విషయం కాదు. కానీ.. వాటికి అంతరాయం కలిగితేనే సమస్య అంతా. ఆ మాటకు వస్తే.. ఏళ్లకు ఏళ్లు నిర్విరామంగా.. ఏ మాత్రం రెస్టు అన్నది తీసుకోకుండా పని చేసే గుండె.. కొద్ది క్షణాలు ఆగిపోతే? సేవలు అందించే సంస్థల తీరు కూడా అంతే. సేవ ఎంత బాగా చేశారనే దాన్ని పట్టించుకునే కన్నా.. సేవా లోపాన్ని తీవ్రంగా పరిగణించటం మామూలే. ఎప్పుడూ లేని రీతిలో ఫేస్ బుక్ ఏడు గంటల పాటు డౌన్ కావటం.. దీంతో ఫేస్ బుక్.. ఇన్ స్టా తో పాటు వాట్సాప్ మెసేజింగ్ యాప్ సర్వీసులు ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ఎందుకిలా జరిగింది? కారణం ఏమిటి? అసలేమైంది? అన్న ప్రశ్నలు పలువురి నోటినుంచి వినిపిస్తున్నాయి. అయితే.. సేవల్ని పునరుద్ధరించిన తర్వాత కూడా అసలు ఎందుకిలా జరిగిందన్న దానిపై ఫేస్ బుక్ వివరణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజా సాంకేతిక సమస్యకు కారణం ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై ఎవరికి వారు తమకు తోచిన కథనాల్ని చెప్పటం కనిపిస్తోంది.

ది వాల్ స్ట్రీట్ జర్నల్ నెగెటివ్ కథనాల ప్రభావంతోనే ఇదంతా జరిగి ఉంటుందని కొందరు చెబుతుంటే.. అదేం కాదు హ్యాకర్ల పనిగా మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఇది పూర్తిగా సాంకేతిక సమస్యగా చెబుతున్నారు. బార్డర్ గేట్ వే ప్రోటోకాల్ ను ఒక ఉద్యోగి మ్యానువల్ గా అప్ లోడ్ చేయటంతోనే ఈ భారీ సమస్య ఉత్పన్నమైనట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే.. సదరు ఉద్యోగి ఎవరు? అతనిపై ఫేస్ బుక్ ఎలాంటి చర్యలు తీసుకుంది? లాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించటం లేదు. ఏమైనా.. ఫేస్ బుక్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన ఈ సాంకేతిక సమస్యకు కారణం ఏమిటన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News