ఏపీ మాజీ మంత్రి మృతి !

Update: 2020-08-12 04:00 GMT
కడప జిల్లాకి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత డాక్టర్ ఖలీల్ బాషా గుండె పోటుతో మృతి చెందారు. వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఖలీల్ ప్రజల నాడి పసిగట్టిన నేత. 1974 నుంచి రెండు రూపాయల ఫీజుతో వైద్యం చేస్తూ అందరి మనసులు గెలిచారు. ఆయన తన నియోజకవర్గంలోనే కాదు, కడప ప్రజలందరికీ స్వయంగా తెలుసు.

ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్ గా ఉన్న ఖలీల్ భాషా టీడీపీ హయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక సారి మైనార్టీ శాఖ మంత్రిగా పని చేశారు. ఎన్‌టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చిన ఖలీల్ 1994, 1999లలో కడప ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కానీ రాజకీయాలు చేస్తున్నా పేదలకు వైద్యసేవను మాత్రం ఆయన ఆపలేదు.  

కరోనా రోగులకు సేవలు అందిస్తూ  గతనెల 30న వైరస్‌ బారిన పడ్డారు. వైరస్ నుంచి విజయవంతంగా కోలుకున్నారు. మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అంత్యక్రియలు కడపలోని ఆయన స్వగృహం వద్ద కోవిడ్‌ – 19 నిబంధనలను అనుసరించి జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.  

మాజీ మంత్రి ఖలీల్‌బాషా పట్ల డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తదితర ప్రముఖ వైసీపీ నేతలంతా దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఖలీల్‌ బాషా మృతి పట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.    
Tags:    

Similar News