కేసీఆర్‌కు మ‌రో షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఈట‌ల‌

Update: 2021-12-08 13:30 GMT
ద‌ళిత బంధు ప‌థ‌కం.. అక్క‌డి నేత‌ల‌ను కీల‌క ప‌ద‌వులు.. ఇత‌ర పార్టీల నాయ‌కుల చేరిక‌.. డ‌బ్బు ప్ర‌వాహం.. వ్యూహాలు, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు.. ఇలా కేసీఆర్ ఎన్ని చేసినా హుజూరాబాద్‌లో మాత్రం విజ‌యం ద‌క్క‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా.. వాట‌న్నింటినీ చిత్తుచేసిన ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌జాభిమానంతో అధికార ప్ర‌భుత్వానికి షాకిచ్చారు.

భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించ‌డంతో టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీ త‌ర‌పున గెలిచిన ఆయ‌న‌.. కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగే బ‌దులిచ్చారు. ఈ విజ‌యంతో రాష్ట్రంలోనూ బీజేపీ మ‌రింత జోరందుకుంది.

ఇప్పుడు మ‌రోసారి..

ఇప్పుడు స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి కేసీఆర్‌కు షాకిచ్చేందుకు ఈట‌ల సిద్ధ‌మ‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా కింద ఆరు స్థానాల‌నూ సొంతం చేసుకున్న టీఆర్ఎస్‌.. స్థానిక సంస్థ‌ల కోటా కింద 12 స్థానాల‌కు గాను ఆరింటిని ఏక‌గ్రీవంగా ద‌క్కించుకుంది.

మిగిలిన ఆరు స్థానాల్లో ఈ నెల 10న పోలింగ్ జ‌రుగుతుంది. అయితే ఈ ఎన్నిక‌లు జ‌రిగే స్థానాల్లో ప్ర‌ధానంగా క‌రీంన‌గ‌ర్‌పైనే అంద‌రి దృష్టి కేంద్రీకృత‌మై ఉంది. ఇక్క‌డి ఎన్నిక‌ల‌పై ఈట‌ల దృష్టి పెట్ట‌డం.. టీఆర్ఎస్ రెబ‌ల్ అభ్య‌ర్థి స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్‌కు ఆయ‌న బాహాటంగానే మ‌ద్ద‌తు ప‌ల‌క‌డ‌మే అందుకు కార‌ణం.

ఇక్క‌డ టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఇద్ద‌రు పోగా.. బ‌రిలో ఉన్న మిగ‌తా 8 మంది ఇండిపెండెంట్ల‌తో మాట్లాడి ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ర‌వీంద‌ర్‌ను ఎంచుకునేలా ఈట‌ల వ్యూహం ర‌చిస్తున్నార‌ని స‌మాచారం.

క్యాంపు రాజ‌కీయాలు..

ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగే చోట అధికార టీఆర్ఎస్‌కే ఆధిక్యం స్ప‌ష్టంగా ఉంది. అయిన‌ప్ప‌టికీ త‌మ స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను విహార యాత్ర‌ల పేరుతో వేర్వేరు ప్ర‌దేశాల్లో క్యాంపుల‌కు త‌ర‌లించింది. పోలింగ్ రోజు వ‌ర‌కూ వాళ్ల‌ను అక్క‌డే ఉంచ‌నుంది. ఇక కాంగ్రెస్ కూడా త‌న ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఇత‌ర ప్ర‌దేశాల‌కు పంపించింది.

క‌రీంన‌గ‌ర్‌లో ప్ర‌తిప‌క్షాలు త‌మ‌కు ప‌ట్టున్న చోట అధికార పార్టీకి ఓట్లు ప‌డ‌కుండా చూసేలా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా మంథ‌ని, హుజూరాబాద్‌, పెద్ద‌ప‌ల్లి ప్రాంతాల్లో ఉన్న ఓట్ల‌పై దృష్టి సారించారు. ఈట‌ల రాజేంద‌ర్‌, మంథ‌ని ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధ‌ర్ బాబు ఈ మేర‌కు ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌ని స‌మాచారం.

ఓట్లు చీల్చి..

హుజూరాబాద్‌, మంథ‌ని, పెద్ద‌ప‌ల్లిలో క‌లిపి మొత్తం 488 ఓట్లు ఉన్నాయి. వాటిని చీల్చి రెబ‌ల్ అభ్య‌ర్థి ర‌వీంద‌ర్ సింగ్ గెలుపు కోసం ఈట‌ల వ్యూహాలు ర‌చించార‌ని స‌మాచారం.

హుజూరాబాద్‌లో 181, మంథ‌నిలో 98, పెద్ద‌పల్లిలో ఏకంగా 209 మంది స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులున్నారు. ఈ ఓట్ల‌లో అధికం అధికార పార్టీకి ప‌డ‌కుండా ఈట‌ల క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని తెలిసింది. అంతిమంగా ఇక్క‌డ అధికార పార్టీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈట‌ల సాగుతున్న‌ట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News