అమ్మో...1వ తేదీ

Update: 2023-03-31 13:01 GMT
ఒకటవ తేదీ వస్తోందంటేనే ఉన్నతాధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఉన్నతాదికారులంటే ముఖ్యంగా ఆర్ధికశాఖ ఉన్నతాధికారులనే అర్ధం. ఎందుకంటే 1, 2 తేదీల్లో ఉద్యోగులకు జీతాలు, రిటైర్ అయినవాళ్ళకి పెన్షన్లతో పాటు సామాజిక పెన్షన్లు కూడా చెల్లించాల్సి రావటమే. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రతినెలా మొదటి రెండు తేదీల్లో జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటే ప్రభుత్వానికి దాదాపు ఏడువేల కోట్ల రూపాయలు అవసరం. ప్రతినెల సంగతి ఎలాగున్నా ఇపుడు మాత్రం ఆర్ధిక సంవత్సరం చివర కావటంతో సమస్య మరింతగా పెరిగిపోతోంది.

మార్చి 31వ తేదీతో ఆర్ధిక సంవత్సరం ముగిసి ఏప్రిల్ 1వ తేదీతో కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవుతుందని అందరికీ తెలిసిందే. పై రెండు సందర్భాల్లోను పెండింగ్ బిల్లుల చెల్లింపులు, కొత్త బిల్లుల చెల్లింపులకు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు నానా అవస్తలు పడతారు. ఇదే సమయంలో ప్రతినెల చివరి వారంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షనన్ల బిల్లులు కూడా రెడీ చేయాలి.

ప్రతినెలా 25 తేదీకి బిల్లులు పాస్ కాకపోతే అవసరమైన నిధులు, బిల్లులు ట్రెజరీలకు అందవు. ట్రెజరీలకు బిల్లులు సకాలంలో అందకపోతే జీతాలు, పెన్షన్లు నిలిచిపోతాయి.

సంక్షేమపథకాల రూపంలో నిధులంతా ఖర్చయిపోతుండటంతో జీతాలు, పెన్షన్ల చెల్లింపుకు ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. నిజానికి జీతాలు, పెన్షన్లు ప్రతినెలా ఉండేదే కాబట్టి కాస్త వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తే పెద్దగా ఇబ్బందుండదు. కానీ జగన్ పాలనలో ఈ వ్యూహమే ఎక్కడో లోపిస్తోంది.

అందుకనే ప్రతినెలా జీతాలు, పెన్షన్లకు సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆర్ధిక సంవత్సరం ముగిసేరోజు కాబట్టి సమస్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారుల్లో మరింత టెన్షన్ పెరిగిపోతోంది. ఉన్నతాధికారులు ఎంత టెన్షన్ పడినా ఉపయోగముండదు.

ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది జగన్ అయినపుడు ఉన్నతాధికారులు టెన్షన్ పడి ఏమిటి ఉపయోగం ? సో, జరుగుతున్నది చూస్తుంటే ఏప్రిల్ నెలలో అందుకునే మార్చి జీతాలు, పెన్షన్లు బాగా ఆలస్యమైనా ఆశ్చర్యపోవక్కర్లేదనేది ఇన్ సైడ్ టాక్. జగన్ టూరు కారణంగా ఢిల్లీ పెద్దలు ఏమైనా పెద్దమొత్తంలో నిధులు విడుదల చేస్తే సమస్య లేకుండా బయటపడచ్చు. అలా చేయకపోతే మాత్రం సమస్యలు తప్పవని ఉన్నతాధికారులు అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News