పిండేస్తున్న షిండే : బాల్ సాహెబ్ పేరుతో కొత్త పార్టీ...?

Update: 2022-06-25 10:02 GMT
శివసేన పుట్టుకకు మూలం బాల్ థాక్రే. ఆయన అరవై దశకంలో శివసేనను స్థాపించారు. ఈ రోజుకు ఆ పార్టీ ఇలా ఉందీ అంటే అది బాల్ థాక్రే వేసిన బలమైన సైద్ధాంతిక పునాదులే అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కాంగ్రెస్ ని తన జీవితకాలం అంతా బాల్ థాక్రే ద్వేషించారు. అలాంటి కాంగ్రెస్ తో జట్టుకట్టాడు ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రే.

దాంతోనే మంటపుట్టిన శివ సేన ఎమ్మెల్యేలు మొత్తంగా రెబెల్స్ గా మారారు. వారంతా సీనియర్ మంత్రి ఏక్ నాధ్ షిండే నాయకత్వంలో ఇపుడు క్యాంప్ రాజకీయాలను నడుపుతున్నారు. ఇక గౌహతిలో ఎమ్మెల్యేలతో కలసి ఉన్న షిండే కొత్త ఆలోచన చేస్తున్నారు.

అసలైన శివసేన పార్టీగా తమను తాము డిక్లేర్ చేసుకోవడం అంటే దానికి చాలా తతంగం ఉంది. దాంతో ఇపుడు దాన్ని పక్కన పెట్టేస్ది కొత్త పార్టీని తామే ఏర్పాటు చేసే పని సులువు అవుతుందని భావిస్తున్నారు.

ఇక కొత్త పార్టీకి కూడా శివసేన పేరు ఉంటుందిట. అయితే బాల్ థాక్రే అని కూడా తగిలించి మరీ వదులుతారుట. అంటే అపుడు తమదే అసలైన పార్టీ అని యావత్తు శివసైనికులకు చెప్పినట్లు అవుతుందని భావిస్తున్నారు.  తొందరలోనే ముంబైకి షిండే సహా రెబెల్ ఎమ్మెల్యేలు అంతా వస్తారని చెబుతున్నారు.

ముంబై గడ్డ మీదనే కొత్త పార్టీ ప్రకటనతో పాటు బీజేపీ సహయాంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయాన్ని చర్చిస్తారు అని చెబుతున్నారు. మొత్తానికి వచ్చే వారానికల్లా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని షిండే పట్టుదలగా ఉన్నారు.

అంతే కాదు అసలైన శివసేన తమదే అని చెబుతూ కొత్త పార్టీని పెట్టి పాత పార్టీ మూలాలను అన్నీ పిండేయడానికి చూస్తున్నారు అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News