బ‌ద్వేల్లో అదే జ‌రిగితే డాక్ట‌ర్ సుధ అరుదైన రికార్డు..!

Update: 2021-10-05 14:44 GMT
క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. ఒక్క‌సారి బ‌ద్వేల్ చ‌రిత్ర ప‌రిశీలిస్తే 1955లో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. 2009లో ఇది ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగితే కాంగ్రెస్‌, టీడీపీ ఎక్కువ సార్లు గెలిచాయి. వైసీపీ ఆవిర్భ‌వించాక జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీయే విజ‌యం సాధించింది.

దివంగ‌త మాజీ ఎమ్మెల్యే బిజివేముల వీరారెడ్డి ఉండ‌గా.. బ‌ద్వేల్ టీడీపీకి కంచుకోట‌గా ఉండేది. ఆయ‌న ఏడు సార్లు ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో ఆయ‌న కుమార్తె కునిరెడ్డి విజ‌య‌మ్మ గెలిచారు. 2004లో ఆమె గోవింద్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2001 ఉప ఎన్నిక త‌ర్వాత ఇక్క‌డ టీడీపీ గెల‌వ‌లేదు. ఇప్పుడు ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య మృతి చెంద‌డంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అంటే 2001లో జ‌రిగిన ఉప ఎన్నిక త‌ర్వాత మ‌రో 20 ఏళ్ల‌కు బ‌ద్వేల్లో ఉప ఎన్నిక జ‌రుగుతుంది.

ఇప్ప‌టికే వైసీపీ నుంచి మృతి చెందిన డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి సుధ‌ను జ‌గ‌న్ త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఇక జ‌న‌సేన టీడీపీ ఇప్ప‌టికే సాంప్ర‌దాయాన్ని అనుస‌రించి తాము పోటీకి పెట్ట‌డం లేద‌ని ప్ర‌క‌టించాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్ త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను పోటీలో పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే క‌మ‌ల‌మ్మ పేరు వినిపిస్తోంది.

ప్ర‌ధాన పార్టీగా ఉన్న టీడీపీతో పాటు జ‌న‌సేన పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు వైసీపీ బీజేపీ, కాంగ్రెస్‌ల‌ను సైతం ఇక్క‌డ పోటీ పెట్ట‌కుండా ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తోంది. బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రాఘురామిరెడ్డి జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చిస్తున్నారు. అయితే అదే జిల్లాకు చెందిన ఓ బీజేపీ కీలక నేత మాత్రం తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోటీలో ఉంటామ‌ని చెపుతున్నారు. ఒక వేళ బ‌ద్వేలు ఏక‌గ్రీవం అయితే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక ఆళ్ల‌గ‌డ్డ‌లో మాజీ మంత్రి అఖిల‌ప్రియ తొలి ఏక‌గ్రీవ ఎమ్మ‌ల్యే కాగా.. రెండో ఎమ్మెల్యేగా సుధ రికార్డుల‌కు ఎక్కుతారు.
Tags:    

Similar News