ట్రంప్ నోట మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2016-03-07 09:37 GMT
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున తుది పోటీలోకి దిగాలని భావిస్తు సంపన్న వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇష్టారాజ్యంగా మాట్లాడేయటం.. వివాదాలకు తెర తీయటం అలవాటైన ఆయన.. తాజాగా ఉగ్రవాదుల గురించి.. వారి కుటుంబ సభ్యుల గురించి చెలరేగిపోయి మాట్లాడారు. ప్రపంచానికి పెద్దన్న ఫోజు కొట్టేసిన ఆయన.. తన తాజా వ్యాఖ్యలతో వాతావరణాన్ని మరింత మంటెక్కించారు.

తాను కానీ అమెరికా అధ్యక్షుడ్ని అయితే.. ఉగ్రవాదుల పట్ల మరింత కరకుగా ఉంటానని.. ప్రస్తుతం ఉన్న చట్టాల్ని మరింత కఠినంగా తయారు చేస్తానని చెప్పిన ఆయన.. అనుమానిత ఉగ్రవాదుల భార్యా.. బిడ్డల్ని చంపేలా చట్టాల్ని మారుస్తానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితే ఉంటే.. అనుమానిత ఉగ్రవాది అన్న ట్యాగ్ లైన్ తో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వీలుందన్న విషయం మర్చిపోకూడదు.

ఇలాంటి విషయాల్ని పెద్దగా పట్టించుకోని ట్రంప్.. ఉగ్రవాదుల పట్ల మైండ్ గేమ్ లో ముందుకు సాగాలంటే ఈ మాదిరి దురుసు వ్యాఖ్యలు తప్పనిసరి అని చెప్పటం గమనార్హం. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని అమెరికన్లు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో అమెరికాలోని మరికొంతమంది ట్రంప్ వ్యాఖ్యలకు విపరీతంగా ఆకర్షితులు కావటం గమనార్హం.
Tags:    

Similar News