అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నాయన ఆ మాట?

Update: 2015-11-29 07:58 GMT
మిగిలిన పదవులు ఒక ఎత్తు. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడి పదవి మరో ఎత్తు. ప్రపంచంలో ఎన్ని పదవులు ఉన్నప్పటికీ.. అమెరికా అధ్యక్ష పదవికి ఉంటే అధికారం.. బాధ్యత చాలా పెచ్చు. పెద్దన్న ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా.. అది ప్రపంచం మీద భారీ ప్రభావం చూపించటం ఖాయం. మరి.. అలాంటి పదవికి పోటీ పడే వారు ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటారు. కానీ.. అందుకు భిన్నమైన వైఖరిని ప్రదర్శించి వార్తల్లోకి వచ్చారు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్.

తాజాగా ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. తాజాగా మియామీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. ప్రపంచంలోని ముస్లింల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు రోజురోజుకీ మరింత ఆటవికంగా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. నిజానికి ట్రంప్ నోటి నుంచి ఇలాంటి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు కొత్తేం కాదు. ఆ మాటకు వస్తే.. అమెరికాలో నివసిస్తున్న అరబ్ దేశాలకు చెందిన ముస్లింల వివరాలు సేకరించాలన్న డిమాండ్ ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు. అమెరికాపై 9/11 దాడులు జరిపిన తర్వాత ముస్లింలు సంబరాలు చేసుకున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏమైనా.. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఒకరైన ట్రంప్ లాంటి వారు మరీ ఇలాంటి విద్వేషపు వ్యాఖ్యలు రావటం సరికాదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.
Tags:    

Similar News