వంశీకి టికెట్ దక్కదా...జగన్ లెక్కలేంటి...?

Update: 2023-03-29 21:02 GMT
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ వైపు వచ్చిన క్రిష్ణా జిలా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వరా. అసలు ఏమి జరుగుతోంది. జగన్ ఏమి ఆలోచిస్తున్నారు. కేవలం వంశీ మాత్రమే కాదు, టీడీపీ నుంచి వైసీపీ వైపు అడుగులు వేసిన మిగిలిన ముగ్గురు సంగతేంటి అన్నది కూడా ఎప్పటి నుంచో చర్చగా ఉంది.

వంశీకి మంచి మిత్రుడు మాజీ మంత్రి అయిన కొడాలి నాని మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. చంద్రబాబు వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను లాగేసుకున్నారని చెబుతున్నారు కదా మరి మీ వైపు వచ్చిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సంగతేంటి అని ప్రశ్నించారు.

దానికి నాని జవాబు చెబుతూ మేము ఎవరినీ మా పార్టీలో చేరమని రమ్మని కోరలేదని అన్నారు. మాకు 151 మంది ఎమ్మెల్యేల బలం ఉందని అయన గుర్తు చేశారు. అయితే చంద్రబాబుతో విసిగి వేసారి వారు వైసీపీ వైపు వచ్చారని అన్నారు. అలాంటి వారికి జగన్ వైసీపీ కండువాలు కప్పలేరు, వారికి మంత్రి పదవులు ఇవ్వలేదని గుర్తు చేశారు.

స్పీకర్ అనుమతితో వారంతా ప్రత్యేక సభ్యులుగానే సభలో కూర్చుంటున్నారు అని అన్నారు. ఇక వారి విషయంలో జగన్ ఏమి చేస్తారన్నది ఆయన ఇష్టమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా బలం ఉన్న వారికే జగన్ టికెట్లు ఇస్తారని, అది తనకైనా వల్లభనేని వంశీకైనా వర్తిస్తుందని అన్నారు.

ప్రజలలో బలం లేకపోతే టికెట్ ఇచ్చే సమస్య లేదని అన్నారు. ఈ విధంగా కొడాలి నాని చేసిన కామెంట్స్ చూస్తే కనుక వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి జగన్ టికెట్ ఇవ్వరా అన్న డౌట్లు వస్తున్నాయి.

ఎందుకంటే అక్కడ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు ఇద్దరు నేతలు కనిపిస్తారు. వారు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు. ఈ ఇద్దరూ ఇపుడు కలసికట్టుగా వంశీ మీద పోరాడుతున్నారు. వంశీని ఓడించాలని టీడీపీ కత్తి కట్టి ఉంది.

సొంత పార్టీలో వ్యతిరేకత బయట టీడీపీ నుంచి కూడా గట్టిగా ఉండడంతో టికెట్ ఇస్తే వంశీ గెలుచుకుని రాగలరా అన్న చర్చ సాగుతోంది. వై నాట్ 175 అంటున్న జగన్ వంశీకి గెలుపు అవకాశాలు లేకపోతే టికెట్ కి నో చెబుతారని అంటున్నారు.

అదే మాటను కొడాలి నాని కూడా ముందే చెప్పేశారా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నలుగురిలో ఇద్దరికి టికెట్ కష్టమనే అంటున్నారు. ఆ ఇద్దరు ఎవరో చూడాల్సి ఉంది. వంశీకి టికెట్ దక్కకపోతే మాత్రం అది సంచలనమే అవుతుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News