దావూద్ అడ్రస్ లలో ఒకటి మిస్ చేసిన దాయాది!!

Update: 2020-08-24 04:30 GMT
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషయంలో దాయాది దేశం ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటుంది. ఏ మాత్రం తొందరపాటు కనిపించదు. అనుకోని విధంగా రెండు.. మూడు రోజుల క్రితం దావూద్ పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితాను విడుదల చేసింది. అందులో అతగాడు కరాచీలో ఉన్నట్లు పేర్కొంటూనే.. ఆ వెంటనే మాట మార్చేసింది.

పాక్ లో అతడి ఆస్తులు ఉన్నాయని చెప్పామే కానీ అతడు ఉన్నట్లుగా తాము ఎప్పుడూ చెప్పలేదంటూ బుకాయించింది. ఇదిలా ఉంటే.. మరో కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. గతంలోనూ దావూద్ కు సంబంధించిన వివరాల్ని వెల్లడించే క్రమంలో కరాచీలోని నాలుగు అడ్రస్ లను చూపించింది. తాజాగా ప్రకటించిన నివేదికలో దావూద్ కు చెందిన మూడు చిరునామాలు మాత్రమే పేర్కొన్నారు. ఒకదాన్ని మాత్రం మిస్ చేయటం గమనార్హం.

తాజాగా వెల్లడించిన జాబితాలో దావూద్ పేరిట మూడు చిరునామాల్ని పాక్ చూపించగా.. పదేళ్ల క్రితం అంటే 2010లో అల్ ఖైదా ఆంక్షల కమిటీ చూపించిన చిరునామాల్లో నాలుగింటిని పేర్కొంది. అందులో ఒకదానిని తాజాగా మిస్ చేసింది.  ఆల్ ఖైదా ఆంక్షల కమిటీల్లో దావూద్ కు సంబంధించి పాక్ చూపించిన చిరునామాల్లో

1. 'వైట్‌ హౌస్‌, కరాచీ',
2. 'హౌస్‌ నెంబర్‌ 37, 30వ స్ట్రీట్‌-డిఫెన్స్‌, హౌసింగ్‌ అథారిటీ కరాచీ',
3. 'పలాటియాల్‌ బంగ్లా, నూరాబాద్‌, కరాచీ' ఉన్నాయి.

2010లో అల్‌ఖైదా ఆంక్షల‌ కమిటీ చూపిన చిరునామాల్లో ఈ మూడింటితో పాటు.. మరో అడ్రస్ ను కూడా చూపించింది. ‘‘మార్గల్లా రోడ్డులోని హౌస్‌ నెంబర్‌ 29, ఎఫ్‌ 6/2 స్ట్రీట్‌ నెంబర్‌.22, కరాచీ’’ కూడా ఉంది. తాజాగా నివేదికలో మాత్రం ఈ అడ్రస్ ను మిస్ చేయటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దావూద్ పేరుతో విడుదల చేసిన జాబితాల్ని చూస్తే.. అతడు కరాచీలోని హై ప్రొఫైల్ చిరునామాల్లో ఉండటం.. సైనిక సంరక్షణలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దావూద్ చిరునామాలుగా పేర్కొంటున్న చోట.. చెత్తను సైతం సైనికుల జోక్యం ఉంటుంది. అలాంటిది.. దావూద్ ఏళ్ల తరబడి ఉంటున్నా.. తమకేమాత్రం తెలీదని చెప్పటం దాయాది దుర్మార్గానికి ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News