నక్సలిజం అంతమైనట్లేనా...వారింకా అడవుల్లోనే !

దేశంలో నక్సలిజం అంతం అయినట్లేనా. మార్చి 31తో కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు ముగిసిపోతోంది.;

Update: 2026-03-31 04:18 GMT

దేశంలో నక్సలిజం అంతం అయినట్లేనా. మార్చి 31తో కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు ముగిసిపోతోంది. మావోయిస్టు రహిత దేశంగా ఏప్రిల్ 1 నుంచి భారత్ ఉంటుందని గతంలో అనేక సార్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా లోక్ సభలో ఇదే అంశం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. మావోయిస్టుల శకం దేశంలో ముగిసింది అని ఆయన స్పష్టం చేశారు.

మోడీ ఘనత అంటూ :

దేశంలో వామపక్ష తీవ్రవాదం అక్కడ అభివృద్ధిని అడ్డుకుందని అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఆయా ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు చేరుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంటున్నారు. ఆయుధాలు చేతబట్టే ఎవరినైనా కఠినంగా అణచివేస్తామని బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు. దేశాన్ని వామపక్ష తీవ్రవాదం నుండి విముక్తి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టామని చెప్పారు. దేశంలోని 12 రాష్ట్రాలలో నక్సలైట్లు రెడ్ కారిడార్ ని సృష్టించారని, తద్వారా ప్రభావిత ప్రాంతాల్లో శాసనబద్ధ పాలన అక్కడ పూర్తిగా కనుమరుగైందని హోం మంత్రి లోక్ సభకు తెలిపారు. వామపక్ష తీవ్రవాద హింసలో ఏకంగా ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోయారని 12 కోట్ల మంది ప్రజలు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఏళ్ల తరబడి పేదరికంలో మగ్గిపోయారని ఆయన పేర్కొన్నారు.

ఎన్డీయే చర్యలతోనే :

అయితే కేంద్రంలో 2014 లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశాన్ని వామపక్ష తీవ్రవాదం నుండి విముక్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం సీరియస్ గా స్టెప్స్ తీసుకుందని అన్నారు. అలా మావోల ప్రభావిత ప్రాంతాలలో 596 పటిష్టమైన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా వ్యవస్థను బలోపేతం చేశామని అమిత్ షా చెప్పారు. 2014లో 126 గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య ఇప్పుడు కేవలం రెండు జిల్లాలకు తగ్గిందని ఆయన గణాంకాలను వెల్లడించారు. గత ఆరేళ్లలో 406 కేంద్ర సాయుధ పోలీసు బలగాల యూనిట్లను ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే భద్రతా దళాలకు 400 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చామని ఆయన చెప్పారు. 2024 నుండి మార్చి 2026 మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లలో 706 మంది నక్సలైట్లను మట్టుబెట్టామని కేంద్ర హోం మంత్రి చెప్పారు. అలాగే 2,218 మంది నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నామని, 4,839 మంది నక్సలైట్లు లొంగిపోయారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ వల్లనే :

ఇదిలా ఉంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే వామపక్ష తీవ్రవాదం పెచ్చరిల్లింది అని అమిత్ షా ఆరోపించారు. నక్సలిజం దేశం ముందున్న ఒక పెద్ద సవాలు అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా అంగీకరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దాని పరిష్కారానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. దేశంలో నక్సల్ హింస 1970వ దశకంలో నక్సల్బరీ ప్రాంతంలో ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు. 1980లలో పీపుల్స్ వార్ గ్రూప్ ద్వారా నక్సలిజం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలలో విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పడిందని, ఆ తర్వాత నక్సల్ హింసాకాండ తీవ్రమైన మలుపు తీసుకుందని ఆయన తెలిపారు. ఈ మొత్తం కాలంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని ఆయన నిందించారు.

ఇంకా అడవుల్లోనే :

ఇదిలా ఉంటే అత్యధిక శాతం మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చేశారు. అయితే ఇంకా కొంత మంది మాత్రం అడవుల్లో ఉన్నారు. వారు అయితే తమ విధానాలను కొనసాగిస్తామని అంటున్నారు. తమ పార్టీ పేదల కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని అంటున్నారు. ఇంకో వైపు మావో అగ్ర నేత గణపతి లొంగిపోతారని నెల రోజుల నుంచి వార్తలు ప్రచారంలో ఉన్నా ఆయన మాత్రం ఈ రోజుకీ లొంగిపోలేదు. దనతో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోంవాలని తెలంగాణా పోలీసులు కోరుతున్నారు. గణపతి ఆరోగ్యం బాగోలేదని తెలిసిందని డీజీపీ శివధర్‌ రెడ్డి చెప్పారు. ఆయన కనుక లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతో పూర్తిస్థాయి వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గణపతితో పాటుగా అజ్ఞాతంలో ఉన్న మరో ఏడుగురు మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని ఆయన కోరారు అలా లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం మీద అతి కొద్ది మంది మాత్రమే మావోయిస్టులు అడవులలో ఉన్నారు. వారి సంగతి ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News