రిటైర్మెంట్‌పై జెన్ జెడ్ గురితప్పిన అంచనాలు.. "60 ఏళ్లకే విశ్రాంతి" ఇక కలగానే మిగిలిపోనుందా?

ప్రస్తుత సమాజంలో ఆర్థిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఒకప్పుడు "60 ఏళ్లకే విశ్రాంతి" అనేది ఒక తిరుగులేని సూత్రం.;

Update: 2026-03-30 22:30 GMT

ప్రస్తుత సమాజంలో ఆర్థిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఒకప్పుడు "60 ఏళ్లకే విశ్రాంతి" అనేది ఒక తిరుగులేని సూత్రం. కానీ నేటి జెన్ జెడ్ (1997-2012 మధ్య జన్మించిన వారు) ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. "అసలు మనం రిటైర్ అవ్వగలమా? లేక జీవితాంతం పనిచేస్తూనే ఉండాలా?" అనే ఒక బలమైన సందేహం ఈ తరంలో గూడు కట్టుకుంటోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. మారుతున్న జీవనశైలి మధ్య రిటైర్మెంట్ అనేది ఒక అందని ద్రాక్షలా మారుతోందనేది కాదనలేని వాస్తవం.

రిటైర్మెంట్ అంటే భయం.. ఎందుకు?

సంప్రదాయ ఆర్థిక నమూనా అయిన "పని – పొదుపు – రిటైర్మెంట్" పై యువతకు నమ్మకం సడలుతోంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు, విద్యా రుణాలు, ఆరోగ్య ఖర్చులు యువత ఆదాయంలో సింహభాగాన్ని హరిస్తున్నాయి. నెల గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో 30 ఏళ్ల తర్వాత అవసరమయ్యే నిధి కోసం పొదుపు చేయడం వీరికి అసాధ్యంగా కనిపిస్తోంది. గిగ్ ఎకానమీ పెరగడం, లేఆఫ్స్ భయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రత తగ్గడం వల్ల స్థిరమైన పెన్షన్ వస్తుందనే ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రభుత్వ పెన్షన్ పథకాలు లేదా సంస్థలు ఇచ్చే బెనిఫిట్స్ భవిష్యత్తులో తమ అవసరాలకు సరిపోతాయా అనే అనుమానం 12 శాతం కంటే ఎక్కువ మంది యువతలో "లైఫ్ టైమ్ వర్క్" భావనను కలిగిస్తోంది.

– తక్షణ సంతోషం vs దీర్ఘకాలిక భద్రత

జెన్ జెడ్ జీవనశైలిలో "యూ ఓన్లీ లైవ్ వన్స్ " (YOLO) అనే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియా ప్రభావంతో విలాసవంతమైన ప్రయాణాలు, ఖరీదైన గ్యాడ్జెట్లపై చేసే ఖర్చు పొదుపు సంస్కృతిని దెబ్బతీస్తోంది. తక్షణ సంతోషం కోసం చేసే ఖర్చుల వల్ల, చక్రవడ్డీ ఇచ్చే అద్భుతమైన లాభాలను వీరు కోల్పోతున్నారు. ఆర్థిక అవగాహన లోపం వల్ల చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ కంటే కేవలం ఖర్చులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. "నేడు మనం చేసే చిన్న పొదుపు, రేపు మనకు లభించే స్వేచ్ఛకు పునాది." ఇది ఆర్థిక నిపుణులు పదే పదే చెబుతున్న మాట. కానీ జెన్ జెడ్ ఇది పాటించడం లేదు.

నిపుణుల హెచ్చరిక.. మేల్కోకపోతే ప్రమాదమే!

ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రిటైర్మెంట్ ప్లానింగ్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ సమయం మించిపోలేదని వారు సూచిస్తున్నారు.భవిష్యత్తును భద్రం చేసుకునే మార్గాలు వెతుకున్నారు. చిన్న వయసులోనే పెట్టుబడి ప్రారంభించడం వల్ల చిన్న మొత్తం కూడా కాలక్రమేణా కోట్లలోకి మారుతుంది. ఎస్.ఐపీ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే ఆదాయాన్ని పొందవచ్చు. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా నిధిని పక్కన పెట్టడం వల్ల ఉద్యోగ అస్థిరత సమయంలో ఒత్తిడి తగ్గుతుంది. కేవలం సంపాదించడం మాత్రమే కాదు.. ఆ సంపాదనను ఎలా కాపాడుకోవాలి, పన్నులు ఎలా ఆదా చేయాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి.

రిటైర్మెంట్ అనేది కేవలం వయసుతో ముడిపడినది కాదు.. అది ఆర్థిక స్వేచ్ఛకు చిహ్నం. "జీవితాంతం పని" అనేది ఒక అనివార్యత కాకూడదు అంటే నేటి యువత తమ వ్యయ ప్రణాళికను పునర్నిర్మించుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించి.. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు పెడితే జెన్ జెడ్ కూడా హాయిగా గౌరవంగా రిటైర్మెంట్ జీవితాన్ని గడపవచ్చు. లేదంటే మారుతున్న కాలంలో ఆర్థిక భద్రత అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News