ఎస్ఏఎస్ సర్వే :కేరళం అధికారం ఆ కూటమిదేనా ?
కేరళం గా పేరు మార్చుకున్న తరువాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ కూటమి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.;
కేరళం గా పేరు మార్చుకున్న తరువాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ కూటమి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ కూడా తమదే ఈసారి అధికారం అని జబ్బలు చరుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఏప్రిల్ 9న జరిగే కేరళం ఎన్నికల్లో ఎవరు విజేత అన్న దాని మీద హైదరాబాద్ కి చెందిన ఎస్ఏఎస్ సర్వే సంస్థ ప్రీ పోల్ సర్వేని చేసింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 27 మధ్యలో చేసిన ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో వెలుగు చూశాయి.
ప్రభావం చూపించే అంశాలు :
కేరళంలో మహిళలు రైతులు, ఎస్సీలు ఎస్టీలు, బీసీలు ఓసీలు, రైతులు, కూలీలు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డు ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు విద్యార్ధులు యువత ఇలా వివిధ ఏజ్ గ్రూప్ కి చెందిన వారి నుంచి ఎస్ఏఎస్ సంస్థ అభిప్రాయ సేకరణ చేపట్టింది. దాని ప్రకారం చూస్తే కనుక అనేక ఫ్యాక్టర్లు ఈసారి ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయని అంటున్నారు. అందులో అధిక ధరలు నిరుద్యోగం, అవినీతి, కాంగ్రెస్ లో అంతర్గత పోరు, క్రిస్టియన్, ముస్లిం ఓటింగ్, పినరయి విజయన్ ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీ, శబరిమల ఆలయంలో బంగారం చోరీ, మతపరమైన పోలరైజేషన్, 14 అసెంబ్లీ సీట్లు మొత్తం ఎన్నికల్లో అధికారం ఎవరి వైపో తేల్చే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండబోతున్నారు అని ఈ సర్వేలో తేలింది.
కాబోయే సీఎం ఎవరు :
ఇక కాబోయే సీఎం ఎవరు అంటే పినరయి విజయన్ కి 30 శాతం మద్దతు ఇచ్చారు. అదే లెఫ్ట్ కూటమిలో కేకే షాజియాకు 8 శాతం, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమిలోని కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వీడీ సతీషన్ కి 29 శాతం మంది, బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్ కి 12 శాతం, కాంగ్రెస్ కి చెందిన కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ కి 7 శాతం, కేసీ వేణుగోపాల్ కి 4 శాతం మంది మద్దతుగా నిలిచారు.
మొగ్గు ఆ పార్టీకేనా :
ఇక ఏ పార్టీకి జనాలు మొగ్గు చూపిస్తున్నారు అంటే ఎల్డీఎఫ్ కి 39 శాతం, యూడీఎఫ్ కి 37 శాతం, బీజేపీకి 16 శాతం ఇతరులకు 3 శాతం మొగ్గు ఉంది. బలమైన క్యాడర్ బేస్ కలిగిన కూటములలో చూస్తే ఎల్డీఎఫ్ కి 40 శాతం, యూడీఎఫ్ కి 34 శాతం, బీజేపీకి 18 శాతం మొగ్గు ఉంది. పినరయి విజయన్ ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్న వారు 39 శాతం ఉంటే భేష్ అన్న వారు 12 శాతం బాగా లేదు పాలన అన్న వారు 40 శాతం మంది ఉన్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అవినీతి మయం అన్న వారు 21 శాతం మంది, ఏవరేజ్ అన్న వారు 26 శాతం అవినీతీ లేదు అన్న వారు 39 శాతంగా ఉన్నారు.
ఓటు షేర్ చూస్తే కనుక :
ఇక కేరళం ఎన్నికల్లో ప్రీ పోల్ సర్వే అంచనాల ప్రకారం ఓటు షేర్ చూస్తే ఎల్డీఎఫ్ కి 40 శాతం యూడీఎఫ్ కి 38 శాతం, ఎన్డీయేకి 14 శాతం ఇతరులకు 5 శాతం ఉంది. ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రభావం చూపించే అంశాలలో నిరుద్యోగం 16 శాతం తో ఉంటే అలాగే అవినీతి 9 శాతం, ధరల పెరుగుదల 17 శాతం, మత పరమైన అంశాలు 3 శాతం, లా అండ్ ఆర్డర్ 5 శాతం, ఆరోగ్యం, విద్య అంశాలు 7 శాతం, పారిశ్రామిక అభివృద్ధి 8 శాతం, సంక్షేమ పధకాలు 11 శాతం, మత పరమైన ఉద్రిక్తతలు 8 శాతం ప్రభావం చూపిస్తున్నాయి. బీజేపీ పోటీతో ఎల్డీఎఫ్ కి దెబ్బ అని 34 శాతం మంది అభిప్రాయపడితే యూడీఎఫ్ కి దెబ్బ అని 18 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేల మీద ప్రజా వ్యతిరేకత అధికంగా ఉందని 38.5 శాతం మంది అంటే వ్యతిరేకత ఉందని 39 శాతం మంది అంటున్నారు. ఇక మాదిరి వ్యతిరేకత అని 10 శాతం చెబుతున్నారు. శబరిమలలో బంగారం చోరీ ప్రభావం ఎంత అంటే లేదు అని 46 శాతం మంది చెబుతున్నారు.
వీరే డిసైడింగ్ ఫ్యాక్టర్ :
ఇక ముస్లిం ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అని 38 శాతం అంటే క్రిస్టియన్లు అని 9 శాతం, నాయర్లు అని 21 శాతం, హిందువులు అని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఓటు షేర్ చూస్తే కనుక ఎల్డీఎఫ్ కి 39 శాతం యూడీఎఫ్ కి 38 శాతం, బీజేపీకి 14 శాతం ఇతరులకు 6 శాతం ఉంది అని ఎస్ఏఎస్ సర్వే చెబుతోంది.
ఎవరికి ఎన్ని సీట్లు :
నార్తెర్న్ కేరళంలో 78 సీట్లు ఉంటే ఎల్డీఎఫ్ కి 26 నుంచి 27, యూడీఎఫ్ కి 21 నుంచి 23, బీజేపీకి 1 వస్తాయని సర్వే చెబుతోంది. అలాగే సెంట్రల్ కేరళలో 53 సీట్లు ఉంటే ఎల్డీఎఫ్ కి 29 నుంచి 30, యూడీఎఫ్ కి 23 నుంచి 24, బీజేపీకి 1 నుంచి 2, సౌతర్న్ కేరళంలో 39 సీట్లు ఉంటే ఎల్డీఎఫ్ కి 14 నుంచి 16, యూడీఎఫ్ కి 23 నుంచి 25, బీజేపీకి 1 నుంచి 2, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు లభిస్తాయని చెబుతున్నారు. మొత్తంగా కేరళంలో 140 అసెంబ్లీ సీట్లు ఉంటే ఎల్డీఎఫ్ కి 69 నుంచి 73, యూడీఎఫ్ కి 67 నుంచి 72, బీజేపీకి 3 నుంచి 4, ఇతరులకు 1 నుంచి 2 లభిస్తాయని ఎస్ఏఎస్ ప్రీ పోల్ సర్వే చెబుతోంది.