అసోంలో ‘మామా ఫ్యాక్టర్’.. ఎన్నికల్లో సీఎం హిమంత మ్యాజిక్!

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అసోంలో ‘మామా ఫ్యాక్టర్’ ఒక బలమైన ఎన్నికల అస్త్రంగా మారింది.;

Update: 2026-03-31 01:30 GMT

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అసోంలో ‘మామా ఫ్యాక్టర్’ ఒక బలమైన ఎన్నికల అస్త్రంగా మారింది. పదేళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ మరోమారు విక్టరీ కొట్టాలని వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యక్తిగత ఇమేజ్ ఆ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతోందని విశ్లేషిస్తున్నారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న హిమంత బిశ్వశర్మను ప్రజలు ‘మామ’గా చూస్తున్నారు. ఆయన కూడా ఆ పిలుపును స్వాగతిస్తూ ప్రజలకు చేరువగా పనిచేశారని గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో ‘మామా ఫ్యాక్టర్’ స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

అసోంలో రెండో బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన హిమంత బిశ్వశర్మ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. ఓ జాతీయ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన ప్రాంతీయ పార్టీ నేత మాదిరిగా శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. 2016-21 మధ్య రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా పనిచేసిన హిమంత బిశ్వశర్మ కోవిడ్ - 19లో విశేషమైన సేవలు అందించి ప్రజలకు చేరువయ్యారు. దీంతో 2021లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనకు ప్రమోషన్ ఇచ్చింది. అయితే అగ్రనాయకత్వం ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకున్న హిమంత బిశ్వశర్మ ఎన్నికలలో బీజేపీని హాట్ ఫేవరెట్ గా నిలపారని అంటున్నారు.

ప్రధానంగా తనను ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజలు తమ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా భావించేలా తన ఐదేళ్ల పాలనలో సీఎం వ్యవహరించారని అసోం మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కారణంగా ఆయన ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటున్నారని అంటున్నారు. రెండు రోజుల క్రితం లఖింపూర్ జిల్లాలో బిహ్‌పురియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మకు ఓ మహిళ హత్తుకుని ముద్దుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీనికంటే ముందు కూడా సీఎం సొంత నియోజకవర్గం జలుక్‌బరిలో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా సీఎం ఎక్కడికి వెళ్లినా మహిళలు, యువత ‘మామా’ అంటూ హోరెత్తిస్తున్నారు.

ఈ పలకరింపులతో పులకించిపోతున్న సీఎం హిమంత బిశ్వశర్మ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, అసోంను ఊపేస్తున్న ఈ మామా ఫ్యాక్టర్ కు ప్రధానంగా సీఎం హిమంత బిశ్వశర్మ ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన పాలన విధానమే అంటున్నారు. ఒరుణోదోయ్ అనే పేరుతో అసోం చరిత్రలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకాన్ని సీఎం ప్రవేశపెట్టారని అంటున్నరు. దీని ద్వారా అర్హులైన మహిళల ఖాతాల్లో నెలకు రూ.1,250 నేరుగా జమ చేస్తున్నారు. సుమారు 40 లక్షల మంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అదేవిధంగా ముఖ్యమంత్రి మహిళా ఉద్యమితా అభియాన్ కింద 'లఖ్పతి బైడియో' అనే మరో పథకాన్ని సీఎం అమలు చేస్తున్నారు. దీనిద్వారా గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి రూ.10 వేల నుంచి రూ.35 వేలు వరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడానికి మరియు బాల్య వివాహాలను అరికట్టడానికి నిజుత్ మోయినా అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిద్వారా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థినులకు నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తున్నారు. ఇవన్నీ మహిళలను సీఎంకు దగ్గర చేశాయని అంటున్నారు.

ఇక యువత కూడా పెద్ద ఎత్తున సీఎం హిమంత బిశ్వశర్మను ఫాలో అవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఫేస్ బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల నుంచి పరీక్షల తేదీలు, ఫలితాలు లేదా ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి విద్యార్థులు నేరుగా సీఎంను ట్యాగ్ చేసి "మామా.. మాకు ఈ అప్డేట్ కావాలి" అని అడుగుతుంటారు. దీనికి ఆయన చాలా సందర్భాల్లో డోంట్ వర్రీ మేనల్లుడా/మేనకోడలా అంటూ స్వయంగా రిప్లై ఇస్తుంటారు. పరీక్షల ఫలితాలు ఆలస్యమైనా లేదా రోడ్లు సరిగా లేకపోయినా యువత నేరుగా ఆయన్ని ట్యాగ్ చేస్తారు. అర్ధరాత్రి పూట కూడా సీఎం రిప్లై ఇస్తూ, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. దీనివల్ల యువతలో "మా మామా వింటాడు" అనే నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు.

ఈ డైరెక్టు కమ్యూనికేషన్ అనేది యువతలో సీఎం పట్ల నమ్మకాన్ని కలిగించిందని అంటున్నారు. మొత్తంగా చూస్తే, అసోం మీడియా హిమంత బిశ్వ శర్మను ఒక హైపర్ యాక్టివ్ సీఎంగా అభివర్ణిస్తోంది. ప్రజలతో ఆయనకున్న ఈ ఎమోషనల్ బాండ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు అతిపెద్ద అస్త్రంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 'ఢిల్లీ పంపిన నాయకుడిలా' కాకుండా తమ మేనమామగా ప్రజలు భావిస్తుండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం హిమంత బిశ్వశర్మను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు పెద్ద సవాల్ గా మారిందని అంటున్నారు.

Tags:    

Similar News